అదానీపై విచారణ డిమాండ్‌తో... ఈడీ ఆఫీసుకు విపక్షాల ర్యాలీ

16 Mar, 2023 02:58 IST|Sakshi
పార్లమెంట్‌ నుంచి ఈడీ ఆఫీస్‌కు ర్యాలీగా వస్తున్న విపక్ష పార్టీల ఎంపీలు

పాల్గొన్న 18 పార్టీల ఎంపీలు 

మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు

న్యూఢిల్లీ: అదానీ గ్రూపు అవకతవకలపై ఈడీతో లోతుగా దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేస్తూ విపక్ష పార్టీలు సమైక్యంగా కదం తొక్కాయి. ఈ ఉదంతంపై ఈడీకి ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌తో పాటు 18 విపక్ష పార్టీల ఎంపీలు బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో పార్లమెంటు భవనం నుంచి ఈడీ ప్రధాన కార్యాలయం వైపు ర్యాలీగా బయల్దేరారు. ఈడీ కార్యాలయానికి వెళ్తున్న ఎంపీలను మార్గమధ్యంలోనే విజయ్‌ చౌక్‌ సమీపంలో పోలీసులు అడ్డుకుని ముందుకు వెళ్లకుండా నిలువరించారు.

బారికేడ్లతో రోడ్లను మూసేశారు. 144 సెక్షన్‌ అమల్లో ఉన్నందున ర్యాలీని అనుమతించబోమని చెప్పారు. దీనిపై నేతలంతా మండిపడ్డారు. అదానీపై విచారణ కోరుతూ ఈడీకి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నిస్తే మోదీ సర్కారు నిరంకుశంగా అడ్డుకుందంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిప్పులు చెరిగారు. దాదాపు 200 మంది ఎంపీల శాంతియుత ర్యాలీని అమానుషంగా అడ్డుకున్నారంటూ దుయ్యబట్టారు. అనంతరం ఎంపీలంతా పార్లమెంటు ప్రాంగణానికి వెనుదిరిగారు. ర్యాలీలో తృణమూల్‌ కాంగ్రెస్, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీలు పాల్గొనకపోవడం విశేషం. అంతకుముందు తృణమూల్‌ విడిగా ఎల్పీజీ సిలిండర్‌ ధర పెంపును నిరసిస్తూ పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం ముందు ధర్నా చేసింది.  
 

మరిన్ని వార్తలు