రాష్ట్రపతి ముర్ముతో ప్రతిపక్షాల భేటీ.. ‘మణిపూర్‌ సమస్యపై జోక్యం చేసుకోండి’

2 Aug, 2023 14:08 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో బుధవారం భేటీ అయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రం మణిపూర్‌లో కొనసాగుతున్న హింస విషయంలో  పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కోరారు. మణిపూర్‌ అంశంపై ప్రధాని పార్లమెంట్‌లో ఒక ప్రకటన చేయాలని, దీనిపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ జరగాలన్న తమ డిమాండ్‌కు ప్రభుత్వం తలొగ్గకపోవడం వంటి అంశాలపై రాష్ట్రపతికి వివరించారు. ఇద్దరు మణిపూర్‌ మహిళలను రాజ్యసభకు నామినేట్‌ చేయాలని కోరారు.

రాష్ట్రపతిని కలిసిన వారిలో జూలై 29, 30 తేదీల్లో మణిపూర్‌లో పర్యటించిన ఎంపీలు, ఇండియా కూటమి నేతలు ఉన్నారు. విపక్ష పార్టీల తరఫున కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ కోరారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం  మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. తాము మణిపూర్ సమస్యను రాష్ట్రపతికి వివరించామని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మణిపూర్‌లో పర్యటించి, శాంతిని పునరుద్ధరించేందుకు కృషి చేయాలనేదే తమ ప్రధాన డిమాండ్ అని చెప్పారు.

కాగా గత మూడు నెలలుగా నెలకొన్న మణిపూర్‌ అల్లర్లపై రూల్‌ 267 ప్రకారం పార్లమెంట్‌లో చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.. అయితే రూల్‌ 176 ప్రకారం స్వల్పకాలిక చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెబుతోంది.
చదవండి: అప్పటిదాకా లోక్‌సభకు రాను: స్పీకర్‌ ప్రకటన

మరిన్ని వార్తలు