ఇది నిరంకుశత్వం.. ప్రధానికి విపక్ష నేతల లేఖాస్త్రం

6 Mar, 2023 03:12 IST|Sakshi

విపక్షమే లేకుండా అంతం చేసే ప్రయత్నాలు

ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాసిన కేసీఆర్, ఇతర విపక్ష నేతలు

ప్రతిపక్షాల ముఖ్య నేతలు టార్గెట్‌గా కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం

 దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు..

మనీశ్‌ సిసోడియా అరెస్టుతో ఈ పరిస్థితి ప్రపంచానికీ తెలిసింది

అత్యధిక కేసులు, అరెస్టులు ఎన్నికల సమయాల్లోనే

అదే బీజేపీలో చేరిన వారి కేసుల దర్యాప్తు గాలికి..

విపక్షాల పాలనలోని రాష్ట్రాలపై గవర్నర్లను ఉసిగొల్పారు

ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవించాలని ప్రధానికి హితవు

లేఖ రాసిన నేతల్లో మమత, కేజ్రీవాల్, శరద్‌ పవార్, అఖిలేశ్, ఉద్ధవ్, తేజస్వీ,ఫరూక్‌ అబ్దుల్లా, భగవంత్‌ మాన్‌

‘‘మన దేశం ఇంకా ప్రజాస్వామికమేనని మీరూ అంగీకరిస్తారని భావిస్తున్నాం. కానీ ప్రతిపక్షాల నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను తీవ్రస్థాయిలో ఉసిగొల్పి దురి్వనియోగపర్చడాన్ని చూస్తుంటే.. మనం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పరిణామం చెందినట్టు అనిపిస్తోంది..’’అని ప్రధాని నరేంద్ర మోదీపై దేశంలోని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. విపక్షాల ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకుంటున్న తీరును పరిశీలిస్తే.. విపక్షమనేదే లేకుండా అంతం చేయడానికి దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారన్న ఆరోపణలకు బలం చేకూరుతోందని పేర్కొన్నాయి.

ఎన్నికల క్షేత్రం వెలుపల ప్రతీకారం తీర్చుకోవడానికి రాజ్యాంగబద్ధ గవర్నర్‌ కార్యాలయాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలను దురి్వనియోగం చేయడం సరికాదని మండిపడ్డాయి. ఈ మేరకు కాంగ్రెసేతర విపక్షాలైన బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా, టీఎంసీ అభినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, శివసేన యుబీటీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే, ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్, ఎస్పీ అధినేత అఖిలేశ్‌యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలోని ముఖ్యాంశాలు వారి మాటల్లోనే.. 

ఎన్నికల సమయాల్లోనే దాడులు అధికం 
‘‘2014 నుంచి ప్రతిపక్షాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను దురి్వనియోగం చేస్తుండటంతో వాటి ప్రతిష్ట మసకబారింది. వాటి స్వయం ప్రతిపత్తి, నిష్పాక్షికతపై ప్రశ్నలను లేవనెత్తింది. వీటిపై దేశ ప్రజలు నానాటికి విశ్వాసాన్ని కోల్పోతున్నారు. చాలా సందర్భాల్లో ఎన్నికల సమయంలో నమోదవుతున్న కేసులు, జరుగుతున్న అరెస్టులను పరిశీలిస్తే.. అవి ఫక్తుగా రాజకీయ ప్రేరేపితమైనవని స్పష్టంగా అర్థమవుతోంది. మీ పార్టీ (బీజేపీ)తో విరుద్ధ భావజాలాన్ని కలిగిన పార‍్టీకి అనుకూలంగా ప్రజలు తీర్పునిచ్చినా గౌరవించి తీరాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ నిర్ణయం. ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ తమ ప్రాధాన్యతను కోల్పోయాయి. 

 దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు

దర్యాప్తు, విచారణల పేరుతో సుదీర్ఘకాలం ఉద్దేశపూర్వకంగా వేటాడి, వెంటాడి ఎలాంటి ఆధారాలు లేకున్నా కూడా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఆయనపై వచ‍్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారం. రాజకీయ కుట్రతో కూడినవి. ఆయన అక్రమ అరెస్టు దేశవ్యాప్తంగా ప్రజలను ఆగ్రహానికి గురి చేసింది. పాఠశాల విద్యలో గొప్ప సంస్కరణలను తీసుకొచ్చి ప్రపంచవ్యాప్త గుర్తింపును మనీశ్‌ సిసోడియా పొందారు. రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టాలన్న లక్ష్యంతో చేపట్టిన దురుద్దేశపూర్వక దర్యాప్తుకు ఈ అరెస్టు తార్కాణంగా నిలిచింది. నిరంకుశ బీజేపీ పాలనలో దేశంలో ప్రజాస్వామిక విలువలకు ముప్పు వాటిల్లిందన్న ప్రపంచం అనుమానాలను నిజం చేసింది. 
 
బీజేపీలో చేరితే కేసుల నుంచి ఉపశమనం 
మీ పరిపాలనలో 2014 నుంచి దర్యాప్తు సంస్థల కేసులు, అరెస్టులు, దాడులు, విచారణలను ఎదుర్కొన్న ప్రముఖ రాజకీయ నాయకుల్లో అత్యధికులు ప్రతిపక్ష నేతలే. బీజేపీలో చేరిన ప్రతిపక్ష నాయకుల కేసులపై విచారణలను దర్యాప్తు సంస్థలు నెమ్మదిగా చేస్తున్నాయి. 2014, 2015 సంవత్సరాల్లో శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణంలో కాంగ్రెస్‌ మాజీ నేత, ప్రస్తుత అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మపై సీబీఐ, ఈడీ విచారణ జరిపాయి. ఆయన బీజేపీలో చేరాక కేసు దర్యాప్తు నీరుగారిపోయింది. నారద స్టింగ్‌ ఆపరేషన్‌ కేసులో టీఎంసీ మాజీ నేతలు సువేందు అధికారి, ముకుల్‌ రాయ్‌లను సీబీఐ, ఈడీ వెంటాడి వేధించాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వారు బీజేపీలో చేరడంతో దర్యాప్తు అటకెక్కింది. ఇవేకాదు మహారాష్ట్రకు చెందిన నారాయణ్‌ రాణే కేసు సహా మరెన్నో ఉదాహరణలు ఉన్నాయి. 
 
విపక్ష నేతలపై వేధింపులు 
2014 నుంచి ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకోవడం, కేసులు పెట్టడం, అరెస్టు చేయడం వంటివి గణనీయంగా పెరిగాయి. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్, శివసేన నేత సంజయ్‌ రౌత్, ఎస్పీ నేత ఆజంఖాన్, ఎన్సీపీ నేతలు నవాబ్‌ మాలిక్, అనిల్‌ దేశ్‌ముఖ్, టీఎంసీ నేత అభిషేక్‌ బెనర్జీ వంటి ప్రముఖ ప్రతిపక్ష నేతలు కేంద్ర దర్యాప్తు సంస్థల చేతిలో వేధింపులను ఎదుర్కొన్నారు. కేంద్రంలోని పాలక పారీ్టకి అనుబంధ విభాగాలుగా కేంద్ర దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయనే అనుమానాలకు ఈ కేసులు బలం చేకూరుస్తున్నాయి. 
 
ఆ సంస్థపై దర్యాప్తు చేయరా? 
రూ.78,000 కోట్లకుపైగా ఒక నిర్దిష్ట సంస్థ (అదానీ గ్రూపు)లో పెట్టుబడిగా పెట్టడంతోనే ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ భారీగా నష్టపోయినట్టు ఓ అంతర్జాతీయ ఫోరెన్సిక్‌ ఆర్థిక పరిశోధన సంస్థ నివేదిక ప్రచురించింది. ప్రజాధనాన్ని దుర‍్వినియోగం చేసిన ఈ సంస్థల అవకతవకలపై కేంద్ర ఏజెన్సీలు ఎందుకు దర్యాప్తు చేయడం లేదు? 
 
గవర్నర్లను ఉసిగొల‍్పి..
సమాఖ్య వ్యవస్థపై యుద్ధానికి కేంద్రం ఇంకో వ్యవస్థను ఉసిగొల్పుతోంది. దేశవ్యాప్తంగా గవర్నర్‌ కార్యాలయాలు రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ, రాష్ట్రాల పాలనకు అడ్డంకులు సృష్టిస్తున్నాయి. గవర్నర్లు ఇష్టానుసారం వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశపూర్వకంగా అణగదొక్కుతున్నారు. బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న తమిళనాడు, మహారాష్ట్ర, పశ‍్చిమ బెంగాల్, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అంతా కేంద్రం, రాష్ట్రాల మధ్య విభేదాలను పెంచుతూ సహకార సమాఖ్య స్ఫూర్తికి ప్రమాదకారులుగా తయారయ్యారు. సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శించడంలో కేంద్రం పూర్తిగా విఫలంకాగా.. రాష్ట్రాలు రాజ్యాంగ విలువలతో సమాఖ్య స్ఫూర్తిని పాటిస్తున్నాయి. గవర్నర్ల వైఖరి పర్యవసానంగా దేశ ప్రజలు ప్రజాస్వామ్యంలో గవర్నర్ల పాత్ర ఏమిటని ప్రశ్నించడం ప్రారంభించారు.’’ అని లేఖలో విపక్షాల నేతలు పేర్కొన్నారు.    

మరిన్ని వార్తలు