మోదీపై విపక్షాలది దుష్ప్రచారమే

17 Jan, 2023 05:32 IST|Sakshi
ఢిల్లీలో రోడ్‌ షో సందర్భంగా ప్రజలకు ప్రధాని మోదీ అభివాదం

సుప్రీంకోర్టు తీర్పులే నిదర్శన

బీజేపీ జాతీయ కార్యవర్గం తీర్మానం

న్యూఢిల్లీ: ‘‘కేంద్రం ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీపై ప్రతిపక్షాల ఆరోపణలన్నీ దుష్ప్రచారాలు మాత్రమే. పలు కేసుల్లో ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల్లోనూ ఇదే స్పష్టమైంది’’ అని బీజేపీ పేర్కొంది. సోమవారం బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీలో కేంద్ర న్యాయ మంత్రి కిరెన్‌ రిజిజు ఈ మేరకు చేసిన రాజకీయ తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మీడియాకు ఈ మేరకు వెల్లడించారు.

‘‘రఫేల్, పెగసస్, సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు, నోట్ల రద్దు, ఈడబ్ల్యూఎస్‌ కోటా తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర దుష్ప్రచారం సాగించాయి. కానీ వీటికి సంబంధించిన అన్ని కేసుల్లోనూ కేంద్రం వైఖరిని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పులు వెలువరించింది. విపక్షాలు చెబుతున్నదంతా అబద్ధమేనని దీంతో తేలిపోయింది’’ అని ఆమె అన్నారు. మోదీపై వారి నిరాధార ఆరోపణలను చట్టపరంగా తిప్పికొట్టామన్నారు. ‘‘దేశం కోసం పనిచేస్తున్న మోదీకి ప్రపంచదేశాల్లో గౌరవం లభిస్తోంది. దేశ ప్రతిష్టను ఆయన పెంచారు’’ అన్నారు.

2023 ఎన్నికలు కీలకం: నడ్డా
లోక్‌సభ ఎన్నికలకు ముందు 2023లో ఎన్నికలు జరిగే 9 రాష్ట్రాల్లో ఒక్కదాన్నీ బీజేపీ కోల్పోరాదని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపును చరిత్రాత్మకంగా ఆయన అభివర్ణించారు. మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి దూసుకుపోతోందని కొనియాడారు.

మోదీకి ఘన స్వాగతం
అంతకుముందు కార్యవర్గ సమావేశానికి వస్తున్న మోదీకి బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. పటేల్‌ చౌక్‌ నుంచి ఎన్‌డీఎంసీ కన్వెన్షన్‌ దాకా పార్టీ కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ప్రధానిపై పూలు చల్లారు. నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వ విజయాలను తెలుపుతూ భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. వేదిక వద్ద మోదీకి నడ్డా స్వాగతం పలికారు.
 

మరిన్ని వార్తలు