Coronavirus: వైరస్‌ పుట్టుక మిస్టరీయేనా?

29 May, 2021 02:40 IST|Sakshi

కరోనా వైరస్‌ పుట్టిందెక్కడ? మరోసారి చక్కర్లు కొడుతున్న ప్రశ్న ఇది. చైనాలోని వూహాన్‌ జంతు వధశాల నుంచే అంటిందని  ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు తేల్చేసినా... అబ్బే కానేకాదు.. అదో కుట్ర అని అమెరికా అనడం తరువాయి.. వైరస్‌ జన్మ రహస్యం తేల్చాల్సిందే అని మళ్లీ తీర్మానాలు మొదలయ్యాయి. ఇంతకీ.. వైరస్‌ది సహజ జన్మమా... లేక టెస్ట్‌ట్యూబ్‌ జననమా?  

ప్రపంచానికి కరోనా వైరస్‌ పరిచయమై ఏడాదిన్నర కాలమవుతోంది. చైనాలోని వూహాన్‌లో మొదలైన మహమ్మారి ప్రస్థానం అతికొద్ది కాలంలో ప్రపంచం మొత్తాన్ని చుట్టేయడమే కాకుండా.. లక్షల మంది ప్రాణాలను హరించిం ది. ఇంత జరిగినా.. ఈ సార్స్‌–కోవ్‌–2 వైరస్‌ పుట్టుక ఎక్కడ? ఎలా జరిగిందన్న ప్రశ్నలకు ఇప్పటివరకూ సంతృప్తికరమైన సమాధానం లేదు. గత ఏడాది మొదట్లోనే వూహాన్‌లోని ఓ పరిశోధనశాల నుంచి ఈ వైరస్‌ కాకతాళీయంగా బయటపడిందన్న వాదన ప్రచారంలోకి రావడం.. దీనిపై విచారణ జరపాలని అప్పటి అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటనలు చేయడం మనం చూసే ఉంటాం.

తీవ్ర చర్చోపచర్చల తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం ఒకటి వూహాన్‌కు వెళ్లి పరిశీలనలు జరిపింది. ఈ వైరస్‌ అడవి జంతువుల నుంచి.. జంతువధశాలల ద్వారా మనుషుల్లోకి     ప్రవేశించి ఉండవచ్చునని, పరిశోధనశాలలో తయారయ్యే అవకాశాలు బాగా తక్కువని తెలిపింది. హమ్మయ్య.. ఒక వివాదం సద్దుమణిగిందని అందరూ అనుకుంటూండగానే.. అమెరికా తాజా అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి ఈ వైరస్‌ పుట్టుక తుట్టెను కదిపారు. మూడు నెలల కాలంలో ఈ అంశంపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

పరిశోధనశాల కుట్ర కోణం ఏమిటి?
వూహాన్‌లోని ‘‘ద వూహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (డబ్ల్యూఐవీ) నుంచి ఈ వైరస్‌ యాదృచ్ఛికంగానో లేదా ఉద్దేశపూర్వకంగానో బయటపడిందన్నది మొదటి నుంచి వినిపిస్తున్న ఒక కథనం. ఈ ఇన్‌స్టిట్యూట్‌ చైనాలోనే అతిపెద్ద బయలాజికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ కావడం గమనార్హం. కరోనా వైరస్‌ను మొట్టమొదటిసారి గుర్తించిన హునాన్‌ జంతు వధశాలకు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఈ పరిశోధన కేంద్రం ఉంటుంది. పరిశోధనశాల నుంచి బయటపడ్డ వైరస్‌ ఈ వెట్‌మార్కెట్‌ (జంతువుల మల మూత్రాదులు నిండి ఉన్న సంత)లోని జంతువులకు చేరిందని ఈ కుట్రను నమ్మేవారు చెబుతారు. అడవి జంతువుల్లో ఉండే ఈ వైరస్‌ను వేరు చేసి మార్పుల్లేకుండా వ్యాప్తి చేశారని వీరు అంటున్నారు. గత ఏడాది అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం ఇది చైనీయులు కుట్రపూరితంగా తయారు చేసి ప్రపంచం మీదకు వదిలారని ఆరోపణలు చేశారు. కరోనా  వైరస్‌ను చైనా జీవాయుధంగా ఉపయోగించిందని ఇంకొందరు వాదించారు.  

తాజా ఆరోపణల వెనుక...?
ఇటీవలి కాలంలో అమెరికాలోని పలు వార్తా పత్రికలు ‘‘వూహాన్‌ పరిశోధన శాల కుట్ర’’కోణంలో పలు వార్తలు ప్రచురించడంతో మరోసారి ఈ అంశంపై చర్చ మొదలైంది. వూహాన్‌ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు ముగ్గురు 2019 నవంబర్‌లో కరోనా లక్షణాలతో చికిత్స పొందినట్లు అమెరికా నిఘా నివేదిక చెబుతున్నా ట్రంప్‌ ఆదేశించిన విచారణను ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌ నిలిపివేశారన్న ఆరోపణలతో కథనాలు రావడం గమనార్హం. అప్పట్లో కుట్ర కోణాన్ని కొట్టిపారేసిన బైడెన్‌ చీఫ్‌ మెడికల్‌ అడ్వైజర్‌ డాక్టర్‌ ఆంథొనీ ఫాసీ లాంటి వారు కూడా ‘‘ఏమో.. కుట్ర జరిగిందేమో. పూర్తిస్థాయి విచారణ జరగాలి’’అనడం పరిస్థితిని మార్చేసింది.  

చైనా ఏమంటోంది?
సహజంగానే.. ఠాట్‌! అమెరికా చెప్పేదంతా అబద్ధమని మొదట్నుంచీ వాదిస్తోంది. పరిశోధనశాల నుంచి తప్పించుకుందనడం తమపై బురద జల్లడమేనని అనడంతో ఆగిపోకుండా.. ఇతర దేశాల నుంచి ఆహారం ద్వారా తమ దేశంలోకి జొరబడి ఉండవచ్చీ మహమ్మారి అని ప్రత్యారోపణలు చేసింది కూడా. చైనాలోని ఓ మారుమూల గనిలో తాము 2015లోనే కరోనా వైరస్‌ను గుర్తించామని, ప్రొఫెసర్‌ షి ఝింగ్లీ గత వారమే ఓ పరిశోధన వ్యాసాన్ని ప్రచురించారని చైనా ప్రభుత్వం నమ్మబలుకుతోంది. ఆ గనిలోని గబ్బిలాల్లో 8 రకాల కరోనా వైరస్‌లు గుర్తించామని, దీనికంటే పాంగోలిన్‌ అనే అడవి జంతువులోని కరోనా వైరస్‌లతో ప్రమాదం ఎక్కువని కూడా ఈ వ్యాసంలో ఉండటం గమనార్హం.

ఏతావాతా చైనా చెప్పొచ్చేదేమిటంటే.. ఈ వైరస్‌ సహజసిద్ధంగానైనా వచ్చి ఉండాలి. లేదంటే ఆహార పదార్థాల ద్వారా ఇతర దేశాల నుంచి దిగుమతి అయి ఉండాలి అని!! చైనా అధికారిక మీడియా సైతం అమెరికాలో వైరస్‌ పుట్టుకపై పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయని సంపాదకీయాల ద్వారా ప్రకటిస్తోంది.  ఇవన్నీ ఇలా ఉంటే.. ఈ వైరస్‌ సహజసిద్ధంగానే ఒక జంతువు నుంచి మరో జంతువు మాధ్యమంగా మనిషిలోకి వచ్చిందన్న గత ఏడాది సిద్ధాంతం కూడా ఇప్పుడు అంతగా పనిచేయడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక కూడా ఈ సిద్ధాంతాన్నే బలపరిచింది. అయితే, కోవిడ్‌–19 కారక కరోనా వైరస్‌ను పోలిన వైరస్‌ అటు గబ్బిలాల్లో, ఇటు ఇతర జంతువుల్లోనూ ఇప్పటివరకూ గుర్తించకపోవడం గమనార్హం.   

శాస్త్రవేత్తల మాట?
కరోనా వైరస్‌ పుట్టుకపై శాస్త్రవేత్తల్లో ఏకాభిప్రాయమైతే లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల నివేదిక అస్పష్టంగా ఉందని పలువురు శాస్త్రవేత్తలు ఆరోపిస్తున్నారు. నిపుణుల బృందం విచారణను చాలా తేలికగా తీసుకున్నట్లు కనిపిస్తోందని, ప్రమాదవశాత్తూ బయటపడిందా? సహజసిద్ధంగా మనుషుల్లోకి ప్రవేశించిందా తేల్చే సమాచారాన్ని సేకరించి ఉండాల్సిందని కొందరు శాస్త్రవేత్తలు సైన్స్‌ మ్యాగజైన్‌కు లేఖ రాశారు. కుట్ర కోణాన్ని క్షుణ్ణంగా విచారించాలని వీరు కోరుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఘెబ్రెయేసిస్‌ స్వయంగా సరికొత్త విచారణ జరగాలని కోరడం విశేషం.
 

కరోనా మూలాలు తెలియాల్సిందే
ప్రపంచ దేశాల డిమాండ్‌కు భారత్‌ మద్దతు
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) సమగ్ర విచారణ జరపాలని అంతర్జాతీయంగా వస్తున్న డిమాండ్లకు భారత్‌ మద్దతు తెలిపింది. చైనాలో కరోనా వైరస్‌ ఎలా వచ్చిందో నిగ్గు తేల్చాలని అమెరికా నిఘా సంస్థలను ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. అమెరికా, ఆస్ట్రేలియాలతో పాటు పలు దేశాలు కరోనా వైరస్‌ మూలాలపై విచారణ జరగాలని డిమాండ్‌ చేస్తున్నాయి. వైరస్‌ మూలాలపై మార్చిలో డబ్ల్యూహెచ్‌ఓ ఒక నివేదిక వెలువరించినప్పటికీ.. దానిపై ప్రపంచదేశాలు సంతృప్తి వ్యక్తం చేయలేదు. ఆ నివేదిక పేర్కొన్న అంశాలపై మరింత అధ్యయనం, వైరస్‌ మూలాలపై ఒక స్పష్టత అవసరమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరింధమ్‌ బాగ్చి తెలిపారు.

 – సాక్షి, హైదరాబాద్‌  

మరిన్ని వార్తలు