‘ఒరిజినల్‌ చాయిస్‌’కు చుక్కెదురు.. గ్రీన్‌ చాయిస్‌కు లైన్‌ క్లియర్‌

16 May, 2022 19:45 IST|Sakshi

బెంగళూరు:  ఒరిజినల్‌ చాయిస్‌ విస్కీ తయారీ కంపెనీకి కోర్టులో చుక్కెదురైంది. గ్రీన్‌ చాయిస్‌ పేరిట మరో బ్రాండ్‌ మార్కెట్‌లోకి రావడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించగా.. కర్ణాటక హైకోర్టులో నిరాశ ఎదురైంది.

ఎంపీ డిస్టెల్లరీస్‌ లిమిటెడ్‌ గ్రీన్‌ చాయిస్‌ పేరుతో ఓ బ్రాండ్‌ను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేయాలనుకుంది. దీనికి స్టేట్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ అనుమతులు కూడా ఇచ్చింది. అయితే.. ఒరిజినల్‌ చాయిస్‌ తయారీ కంపెనీ జాన్‌ డిస్టిల్లరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించింది. 

ప్రత్యర్థి విస్కీ కంపెనీ తమ బ్రాండ్‌ను కాపీ కొడుతూ మోసపూరితంగా గ్రీన్‌ చాయిస్‌ను మార్కెట్‌లోకి దించుతోందని, పైగా ఎక్సైజ్‌ కమిషనర్‌ ఈ అభ్యంతరాలపై తమ వాదనలు సైతం వినకుండా జనవరి 1, 2022 అనుమతులు జారీ చేశారని పిటిషన్‌లో పేర్కొంది. 

ఈ పిటిషన్‌పై వాదనలు విన్న జస్టిస్‌ జ్యోతి ముళిమణి.. జాన్‌ డిస్టెల్లరీస్‌ వాదనలను తోసిపుచ్చింది. ఎక్సైజ్‌ కమిషనర్‌ తమకున్న అధికారాన్ని ఉపయోగించి.. సరైన నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుందని వ్యాఖ్యానించింది. ఇందులో ఎలాంటి అధికార దుర్వినియోగం జరగినట్లు తాము గుర్తించలేదని, పైగా పోటీదారు కంపెనీపై ట్రేడ్‌మార్క్‌ ఉల్లంఘన ఆరోపణలను సైతం తిరస్కరిస్తూ.. గ్రీన్‌ చాయిస్‌కు లైన్‌ క్లియర్‌ చేసింది కర్ణాటక హైకోర్టు.

చదవండి: నటి రమ్య వ్యాఖ్యలపై ఆగ్రహం

మరిన్ని వార్తలు