ప్రియుడిని చొక్కా పట్టి ఈడ్చుకెళ్లిన ప్రియురాలు

13 Sep, 2021 17:35 IST|Sakshi
ప్రియుడిని పోలీస్‌స్టేషన్‌కు లాక్కొని వెళ్తున్న బాధితురాలు

రాయగడ(భువనేశ్వర్‌): ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అవసరం తీరాక వదిలి వెళ్లిపోయాడు. అయితే తనకు జరిగిన మోసానికి ఆమె కుంగిపోలేదు. ప్రేమించిన వాడి ఆచూకీ తెలుసుకొని, నేరుగా ఇంటికి వెళ్లి, నిలదీసింది. తనతో రమ్మని కోరగా.. అతడు ససేమిరా అనడంతో కాలర్‌ పట్టుకొని పోలీస్‌ స్టేషన్‌కు ఈడ్చుకెళ్లింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను అర్థించింది.

రాయగడ జిల్లాలోని బిసంకటక్‌ సమితిలో చోటు చేసుకున్న ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిసంకటక్‌ ఐఐసీ అధికారి సుభాష్‌చంద్ర కొరకొరా తెలిపిన వివరాల ప్రకారం... కుంకుబడి గ్రామానికి చెందిన యువకుడు సుమన్‌ కుసులియా ఉపాధి కోసం 6 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌ లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రొయ్యిల పరిశ్రమలో పనికి చేరాడు. అదే పరిశ్రమలో పనిచేస్తున్న విశాఖపట్నం జిల్లా పాడేరుకు చెందిన యువతి బెలసుర కుమారితో స్నేహం ఏర్పడింది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో 3నెలల క్రితం అక్కడికి సమీపంలోని ఆలయంలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.  

ఆటోస్టాండ్‌లో ఎదురయ్యాడు.. 
కలిసి కొన్నాళ్లు కాపురం చేసిన తరువాత.. కొద్ది రోజుల క్రితం సుమన్‌ ఎవరికీ చెప్పకుండా భీమవరం నుంచి బిసంకటక్‌ వచ్చేశాడు. రోజులు గడుస్తున్నా తన భర్త తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన కుమారి అతని ఆచూకీ కోసం ఆరా తీసింది. స్వగ్రామంలో ఆటో నడుపుతున్నాడని తెలుసుకొని, తన అన్నయ్య సాయంతో శుక్రవారం రాత్రి బిసంకటక్‌ చేరుకుంది.

శనివారం ఉదయాన్నే ఆటోస్టాండ్‌లో వెతకగా.. అక్కడ ఎదురైన సుమన్‌ను నిలదీసింది. తనతో రమ్మని ప్రాధేయపడగా, అతడు అంగీకరించలేదు. తనకు కొద్ది రోజు క్రితమే వేరే అమ్మాయితో వివాహం జరిగిందని చెప్పడంతో ఆమె ఆగ్రహానికి గురైంది. అందరూ చూస్తుండగానే అతడి షర్ట్‌ కాలర్‌ పట్టుకొని బిసంకటక్‌ పోలీస్‌ స్టేషన్‌కు ఈడ్చుకుంటూ వెళ్లింది. దీనిపై పోలీసులు ఇంతవరకు కేసు నమోదు చేయనప్పటికీ సుమన్‌ను అదుపులోకి తీసుకొని, విచారణ చేస్తున్నారు.  

చదవండి: అయ్యో చిట్టి తల్లి.. అప్పుడే నూరేళ్లు నిండాయా..

మరిన్ని వార్తలు