Orissa: ధైర్యం చెప్పి.. థింసా స్టెప్పులేసి.. పిల్లలతో సరదాగా గడిపిన ఎస్పీ

28 May, 2022 14:40 IST|Sakshi

భువ​నేశ్వర్‌: ఆమె ఓ జిల్లాకు పోలీస్‌ బాస్‌. నిత్యం నేర సమీక్షలు, శాంతి, భద్రతల పరిరక్షణ, సిబ్బంది విధులపై పర్యవేక్షణ, ఫిర్యాదుదారులతో నిత్యం క్షణం తీరికలేకుండా ఉంటారు. ఐపీఎస్‌గా ఉన్నా.. ఆశ్రమ చిన్నారులతో కలిసి ఆడిపాడారు. నేనున్నానంటూ వారిలో మానసిక ధైర్యం నింపారు. ఆమె.. నవరంగ్‌పూర్‌ జిల్లా ఎస్పీ ఎస్‌.సుశ్రీ. నవరంగ్‌పూర్‌ జిల్లా కేంద్రం సమీపం లోని ప్రభుత్వ ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న దీనదయాల్‌ ఆశ్రమాన్ని ఎస్పీ గురువారం సందర్శించారు.

ఆమెతో పాటు కలెక్టర్‌ కమలోచన్‌ మిశ్రా ఉన్నారు. వీరిద్దరూ బాలికలకు మిఠాయిలు, మామిడి పళ్లు పంచిపెట్టారు. ఎస్పీ చొరవ కల్పించుకొని బాలికలలో ఒకరిగా కలసిపోయి కులాశాగా కబుర్లు చెప్పారు. ఈ నేపథ్యంలో చిన్నారులంతా కొరాపుటియా థింసా నృత్యం చేయగా.. సుశ్రీ కూడా వారితో జత కలిసి, స్టెప్పులేశారు. స్వయానా జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్‌ తమతో డ్యాన్స్‌ చేస్తుండటంతో బాలికలు మరింత ఉత్సాహంగా ఆమెకు సూచనలు చేస్తూ ముందుకు సాగారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో చూసిన వారంతా ఎస్పీ చొరవను అభినందిస్తున్నారు. 

చదవండి: వింత ఆచారం: కొరడాతో మహిళలను కొట్టి, ఈలలు వేస్తూ..

మరిన్ని వార్తలు