ఐదున్నరేళ్ల చిన్నారి చిచ్చర పిడుగులా..

21 Aug, 2021 13:29 IST|Sakshi

భువనేశ్వర్: పాతికేళ్లు వచ్చినా.. రిపబ్లిక్‌ డే ఎప్పుడో కూడా తెలియని వారు సమాజంలో చాలామంది తారస పడుతుంటారు. ఇంటర్వ్యూల్లో అధికారులు అడిగిన ప్రశ్నలకు ఎంతటి వారైనా నీళ్లు నమలాల్సిందే. అయితే ఐదున్నరేళ్ల చిన్నారి చిచ్చర పిడుగులా 48 దేశాలు, వాటి రాజధానులు చెబుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేవలం 40 సెకన్ల లోనే వీటిని చెప్పడంతో పాటు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.. జయపురం నకు చెందిన చిన్నారి అన్విత మిశ్ర.

స్థానిక రాజు వీధిలోని వ్యాపారి శంకర మిశ్ర, మధుస్మిత ప్రాణిగ్రాహిల కుమార్తె అన్విత ప్రస్తుతం జయపురం ప్రకాశ్‌ విద్యాలయంలో యూకేజీ చదువుతోంది. చిన్నతనంలోనే తన మేధస్సుతో ఇప్పటికే పలు రికార్డులు నెలకొల్పింది. గతంలో 34 సెకెన్లలో దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పేర్లను అనర్ఘళంగా చెప్పింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆసియా ఖండంలోని 48 దేశాల పేర్లు, వాటి రాజధానులను 48 సెకెన్లలో చెప్పడం పూర్తి చేసింది. దీనికి సంబంధించిన వీడియోను జూలైలో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థ వారికి పంపించారు. దీనిని బలపరుస్తూ సంస్థ నుంచి రెండు రోజుల క్రితం ధ్రువపత్రం అందిందని తల్లిదండ్రులు వెల్లడించారు. ప్రశంసాపత్రం తోపాటు మెడల్, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు పుస్తకం, మరికొన్ని బహుమతలు పంపించారని తెలిపారు. కాగా... చిన్నారి అన్విత ప్రతిభ, అవార్డు పొందడం పట్ల జయపురం పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు