సీతమ్మ ఆగ్రహం.. దుస్తులు లేకుండా ఉంటారని శాపం.. అప్పటినుంచి..

9 Aug, 2022 15:09 IST|Sakshi

మల్కన్‌గిరి(భువనేశ్వర్‌): జిల్లాలోని ఖోయిర్‌పూట్‌ సమితి ముదిలిపొడ, ఓండ్రహల్‌ పంచాయతీల్లో సుమారు 10వేల మంది బొండా గిరిజన తెగలవారు జీవిస్తున్నారు. వీరి నివాసాలన్నీ సముద్ర మట్టానికి 4వేల అడుగులు ఎత్తులో, జన జీవనానికి దూరంగా, వన్య ప్రాణులు, జల పాతాలకు దగ్గరగా ఉంటాయి. వీరి వస్త్రధారణకు సంబంధించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడుతో కలిసి వనవాసం చేస్తున్న సమయంలో బొండా ఘాట్‌ సమీపంలోని జలాపాతం వద్ద సీతాదేవి స్నానం చేస్తుండగా చూసిన ఓ బొండా మాహిళ నవ్వింది.

ఆగ్రహానికి గురైన సీతమ్మ వారు.. ఇకపై మీరు కూడా దేహంపై దుస్తులు లేకుండా ఉంటారని శపించారు. దీంతో మహిళలంతా కలిసి, క్షమాపణ కోరగా.. తాను కట్టుకున్న చీరలో చిన్న ముక్కను వారికిచ్చింది. అప్పటి నుంచి బొండా మహిళలంతా సీతాదేవి మాటకు కట్టుబడి నడుము కింది భాగంలో వస్త్రం మినహా, శరీరమంతా పూసలు, వెండి కడియాలు చుట్టుకుంటారు. తాము ఫొటో దిగితే తమ ఆత్మలో సగం ఎవరో తీసుకుపోతారనే మూఢ నమ్మకంతో ఇప్పటికీ ఆయుధం తోనే బయటకు వస్తుంటారు. ప్రతి గురువారం ఒనకఢిల్లీ, ఆదివారం జరిగే ముదిలిపొడ సంతలకు అటవీ ఉత్పత్తులతో గుంపులుగా వెళ్తారు. అక్కడ తమకిష్టమైన జీలుగు కల్లు, అలంకరణ సామగ్రి, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తాంటారు.

చదవండి: లవ్‌ వైరస్: హెచ్‌ఐవీ పేషెంట్‌తో ప్రేమ.. ప్రాణం మీదకు తెచ్చుకుంది!

మరిన్ని వార్తలు