orissa: ఆన్‌లైన్‌ కష్టాలు.. చదవాలంటే చెట్టెక్కాల్సిందే

11 Jul, 2021 14:46 IST|Sakshi

సాక్షి, పర్లాకిమిడి( భువనేశ్వర్‌): ఆన్‌లైన్‌ విద్యా బోధనతో గజపతి జిల్లా విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలో ఇంటర్‌నెట్‌ సిగ్నల్స్‌ సక్రమంగా అందకపోవడంతో ఆన్‌లైన్‌ బోధన విద్యార్థులకు అందని ద్రాక్షలా తయారైంది. దేశంలోని అన్ని చోట్లా 4జీ సేవలు అందుబాటులో ఉండగా మెట్రో సిటీల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కానీ స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు కావొస్తున్నా జిల్లాలో మొబైల్‌ సేవలకు ప్రజలు నోచుకోవడం లేదు. ప్రతి పంచాయతీకి  ఫైబర్‌ నెట్‌ వర్క్‌ అందిస్తామని కేంద్రం చెబుతున్నా గజపతి జిల్లాలో ఆ సేవల జాడే లేదు. జిల్లాలో విద్యార్థులకు కనీసం 2జీ సేవలు కూడా అందకపోవడంతో చెట్లు, కొండలు ఎక్కుత సిగ్నల్స్‌ కోసం వెతుక్కుంటూ క్లాసులు వింటున్నారు. ఈ కష్టాలపై జిల్లా ప్రజలు పలుమార్లు కలెక్టర్‌ దృష్టికి తెచ్చినా ఫలితం లేకపోయింది. 

పట్టించుకోని బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు
ప్రతిసారీ జరుగుతున్న జిల్లా సమీక్షలో  ఇంటర్‌నెట్‌ సేవల కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్స్‌తో పాటు నెట్‌వర్క్‌ స్పీడ్‌ పెంచాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నా పట్టించుకునే వారే కరువయయ్యారు. జిల్లాలో ఇతర ప్రైవేటు నెట్‌వర్క్‌ కనెక్షన్లు పనిచేయవు. బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌ వర్క్‌పైనే ఉద్యోగులు, విద్యార్ధులు ఆధారపడుతున్నారు. ఆధార్, ఈ–సేవా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఆన్‌లైన్‌లోనే పనిచేయాలని ప్రభుత్వం ఆదేశిస్తుంటే నెట్‌వర్క్‌ అందకుండా పనిచేయడం ఎలా అని పశ్నిస్తున్నారు.  జిల్లా కేంద్రం పర్లాకిమిడిలోనే   నెట్‌వర్క్‌ సిగ్నల్స్‌ అందడం లేదంటే మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.  ఇన్ని అవస్థలు పడుతున్నా బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులకు చీమ కుట్టినట్లయినా లేకపోతోందని జిల్లా ప్రజలు వాపోతున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు