అయ్యో.. ఆ ప్రాంత విద్యార్థులకు చదవాలని ఉన్నా..

1 Oct, 2021 10:06 IST|Sakshi

సాక్షి,రాయగడ(భువనేశ్వర్‌): పాఠశాలల్లో డ్రాపవుట్‌ శాతాన్ని తగ్గించేందుకు జిల్లా యంత్రాంగం ఒకవైపు చర్యలు తీసుకుంటుండగా, మరోవైపు సరైన వసతి, రహదారి సౌకర్యాలు లేక ఎంతోమంది విద్యార్ధులు చదువులకు స్వస్తి చెబుతున్నారు. కొలనార సమితిలోని పాత్రపుట్, ఇమిలిగుడ గ్రామాలకు చెందిన విద్యార్థులు ఇప్పటికీ పాఠశాలలకు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. నివాసాలకు సమీపంలో పాఠశాలలు లేక, పూజారిగుడ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళుతున్నారు.

విద్యార్థులు ఈ పాఠశాలకు చేరుకోవాలంటే పాత్రపుట్‌కు, పూజారిగుడ మధ్యనున్న నాగావళి నదిని దాటాల్సి ఉంది. ప్రతీఏటా వర్షాకాలంలో నదీప్రవాహం ఎక్కువగా ఉంటుండటంతో విద్యార్థులు తమ పాఠశాలకు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ప్రమాదకరమని తెలిసికూడా విద్యార్థులు నదిని దాటుతున్నారు. నాలుగేళ్ల క్రితం గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా రూ.8కోట్లతో పాత్రపుట్‌ వద్ద వంతెన నిర్మాణం చేపట్టారు. అయితే, ఏళ్లు గడుస్తున్నా వంతెన నిర్మాణ పనులు పూర్తి కాలేదు. వంతెన నిర్మాణం పూర్తయితే, తొమ్మిది గ్రామాల ప్రజలకు రాకపోకల సౌకర్యం మెరుగుపడనుంది. ఈ విషయమై ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌ ప్రదీప్‌కుమార్‌ మాట్లాడుతూ.. నిర్మాణ వ్యయం పెరగడంతో వంతెన పనులు నిలిచిపోయాయని, నిధుల కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపించామన్నారు.

చదవండి: Cyclone Gulab: అందరికీ గుర్తుండి పోయేలా.. ‘గులాబ్‌’ పేరు పెట్టి మురిసిపోయిన తల్లులు

>
మరిన్ని వార్తలు