‘మా పొట్ట కొట్టకండి సారూ.. గంజాయి పండించుకుంటాం’

23 Nov, 2021 14:53 IST|Sakshi

మల్కన్‌గిరి(భువనేశ్వర్‌): జిల్లాలోని చిత్రకొండ సమితి, ధూళిపూట్‌ పంచాయతీలో గిరిజనుల ప్రజా మేళా సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గత కొద్దిరోజులుగా పోలీసులు ధ్వంసం చేస్తున్న గంజాయి సాగుపై గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి సాగుతో తమకు ఎంతో కొంత ఉపాధి కలుగుతోందన్నారు. ఇప్పుడు వాటిని అధికారులు నాశనం చేసి, తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో వేరే పంటలు పండించేందుకు చాలా పెట్టుబడి అవుతుందని, అంత స్తోమత తమకు లేదన్నారు. దీంతో పెట్టుబడి అవసరం లేని గంజాయి సాగుపై ఆధారపడి బతుకుతున్నామన్నారు. ఉపాధి అవకాశాలైనా కల్పించాలని, లేకపోతే గంజాయి సాగుకి అనుమతి అయినా ఇవ్వాలని వారు కోరారు. అనంతరం చిత్రకొండ తహసీల్దారు టి.పద్మనాబ్‌ బెహరాకి వారు వినతిపత్రం అందజేశారు.  

85 ఎకరాల గంజాయి సాగు ధ్వంసం 
మల్కన్‌గిరి జిల్లాలోని చిత్రకొండ సమితి, బోడపోదర్‌  పంచాయతీలో ఉన్న రేఖపల్లి, పల్సన్‌పోదర్,  కుమార్‌గూడ  ప్రాంతాల్లో  అక్రమంగా 85 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయిని చిత్రకొండ పోలీసులు సోమవారం ధ్వంసం చేశారు. నాశనం చేసిన గంజాయి సాగు విలువ దాదాపు రూ.12 కోట్లు చేస్తుందని పోలీసులు తెలిపారు
చదవండి: Karnataka: ఆ ప్రాంతం మరో గోవా కానుంది..

మరిన్ని వార్తలు