నాడు అంతర్జాతీయ వెయిట్‌ లిఫ్టర్‌.. నేడు కూలీ

27 Feb, 2021 14:00 IST|Sakshi
కూలీ పని చేస్తున్న అరుణ్‌ కుమార్‌ శాంత, (ఇన్‌సెట్‌లో)అరుణ్‌ కుమార్‌ శాంత

భువనేశ్వర్‌ : తాను బరువులెత్తి దేశం పరువు పెంచాడు ఆ ఆదివాసీ యువకుడు. ప్రభుత్వం సహకరిస్తే మరింత ముందుకు సాగి దేశ ప్రతిష్టను ఇనుమడింప చేయాలనుకున్నాడు. అయితే బంగారు పళ్లానికైనా గోడ చేర్పు ఉండాలన్న సామెతలా తయారైంది ఓ అంతర్జాతీయ క్రీడాకారుడి పరిస్థితి. ఆ క్రీడాకారుడు ఎంతటి ప్రతిభ సాధించినప్పటికీ   ప్రోత్సాహం లభించక మరుగున పడిపోతున్నాడు. ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించి దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టిన క్రీడాకారుడికి ప్రభుత్వ ప్రోత్సాహం, ఆదరణ లేకపోవడంతో ప్రస్తుతం రోజుకూలీగా మారి జీవనం సాగిస్తున్నాడు. నవరంగపూర్‌ జిల్లా ఉమ్మరకోట్‌ సమితి తెలరి గ్రామానికి చెందిన ఆదివాసీ యువకుడు అరుణ శాంత దేశం తరఫున అంతర్జాతీయ పోటీలలో మూడు సార్లు పాల్గొని రెండు గోల్డ్‌మెడల్స్, ఒక బ్రాంజ్‌ మెడల్‌ సాధించి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చాడు.

అంతే కాకుండా రాష్ట్ర, జాతీయ అనేక పతకాలు గెలుపొంది ఖ్యాతి గడించాడు. దేశం కోసం ఆడి గౌరవం తెచ్చిపెట్టిన అరుణ శాంత నేడు రోజు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు.  ఒలంపిక్స్‌లో పాల్గొని విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్న అరుణశాంతకు ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో ఒలంపిక్స్‌ ఆకాంక్ష కలగానే మిగిలిపోయింది. ఆర్థిక ఇబ్బందులు, పేదరికం కారణంగా నేడు భుజాన గొడ్డలి వేసుకుని కూలి పనికి వెళ్తున్నాడు. కూలి దొరికిన రోజున కుటుంబం ఆకలి తీరుతుంది. లేనప్పుడు అర్ధాకలితో ఉండాల్సిందే. అరుణ శాంత ఉమ్మరకోట్‌లో 7 వ తరగతి వరకు చదివి అనంతరం బరంపురం స్పోర్ట్స్‌ స్కూల్‌లో చేరి వెయిట్‌ లిఫ్టింగ్‌లో శిక్షణ పొందాడు. 

ప్రభుత్వం గుర్తిస్తే మరిన్ని విజయాలు
శిక్షణ అనంతరం రాష్ట్ర , జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొంటూ అనేక విజయాలు సాధిస్తూ వచ్చాడు. 2012లో మయన్మార్‌లో జరిగిన ఏషియన్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలలో పాల్గొని బంగారు పతకం సాధించాడు. అదే ఏడాది  జరిగిన ఆసియా దేశాల కామన్‌వెల్త్‌ గేమ్స్‌ లో బంగారు పతకం గెలిచి సత్తా చాటాడు. అలాగే జాతీయ స్థాయిలో ఢిల్లీ, బెంగళూరు, మహారాష్ట్రలలో జరిగిన పోటీలలో పాల్గొని అనేక బహుమతులు సాధించాడు.  బహుళ ఆదివాసీ ప్రాంతంలో పుట్టి వెయిట్‌ లిఫ్టర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన అరుణ శాంతకు ఇప్పటికైనా ప్రభుత్వం చేయూత అందిస్తే మరెన్నో విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురాగలడనడంలో సందేహం లేదు.   

ఒలంపిక్స్‌లో విజయం లక్ష్యం
ఒలంపిక్స్‌ పోటీలలో ఆడి దేశానికి పేరు తేవాలని ఉంది. అయితే అందుకు అవకాశాలు కనిపించడం లేదు. నన్ను ప్రభుత్వం గుర్తించక పోవడం విచారకరం. వెయిట్‌లిఫ్టింగ్‌పై ఆశక్తి వల్ల ఎక్కువగా చదువుకోలేకపోయాను. ప్రభుత్వం తగిన సహాయం అందిస్తే ఒలింపిక్స్‌లో పాల్గొనాలని ఉంది. 
–అరుణ శాంత, వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారుడు

>
మరిన్ని వార్తలు