మితిమీరితే ఒప్పుకోం.. ఓటీటీ కంటెంట్‌పై కేం‍ద్రం సీరియస్‌!

20 Mar, 2023 11:23 IST|Sakshi

ఇటీవల ఓటీటీలో అశ్లీలత, అసభ్య పదజాలంతో కూడిన కంటెంట్‌ పెరుగుతోందన్న సంగతి తెలిసిందే. సినిమాలకు ఉన్నట్లుగా సెన్సార్ కత్తెర ఓటీటీ కంటెంట్‌లకు లేకపోవడంతో వీళ్లు హద్దలు దాటి ప్రవర్తిస్తున్నారని కొందరి వాదన. అయితే తాజాగా దీనిపై కేంద్రం స్పందించింది. ఓటీటీకి ఇచ్చిన స్వేచ్ఛ క్రియేటివిటీ కోసమని.. అశ్లీలత, అసభ్య పదజాలం వాడేందుకు కాదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. ఎవరైనా పరిమితి దాటితే జోక్యం చేసుకోవడానికి ప్రభుత్వం వెనుకాడదని ఆయన ఘటుగా స్పందించారు. నాగ్‌పూర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

చర్యలు తీసుకునేందుకు వెనకాడబోం
ఓటీటీ ప్లాట్‌ఫారంలు చేస్తున్న దుర్వినియోగం, అశ్లీల కంటెంట్‌పై ఇటీవల ఫిర్యాదులు వచ్చాయన్న ఆయన.. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు. ఈ ప్లాట్‌ఫారంకు ఇచ్చిన స్వేచ్ఛ సృజనాత్మకత కోసం తప్ప అశ్లీలత లేదా దుర్వినియోగం కోసం కాదని, ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాడానికి సిద్ధంగా ఉందన్నారు. ఇందులో మార్పులు తీసుకురావడానికి నిబంధనల్లో ఏమైనా మార్పులు అవసరమవుతాయా అనే కోణాన్ని ఐటీశాఖ పరిశీలిస్తుందని తెలిపారు.

వీటిపై ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో, నిర్మాతలు ముందుగా ఈ సమస్యను పరిష్కరించాలని మంత్రి సూచించారు. ఇటీవల వెబ్ సిరీస్ "కాలేజ్ రొమాన్స్" గురించి ఢిల్లీ హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజుల తర్వాత ఠాకూర్ వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. వెబ్‌ సీరిస్‌ కంటెంట్‌లో అసభ్యకర పదజాలం వంటి భాష విస్తృతంగా ఉన్నందున అవి ప్రజలను ప్రభావితం చేయగలదని కోర్టు పేర్కొంది.
 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు