ఇది భారత శతాబ్దం

25 Jul, 2022 03:17 IST|Sakshi

భవిష్యత్‌ తరాల కోసం పర్యావరణాన్ని కాపాడండి

జాతినుద్దేశించి రాష్ట్రపతి కోవింద్‌ వీడ్కోలు ప్రసంగం

న్యూఢిల్లీ: మూలాలను మర్చిపోరాదని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దేశ యువతను కోరారు. ప్రకృతి మాత తీవ్ర వేదన చెందుతోందని, వాతావరణ సంక్షోభంతో పుడమి భవిష్యత్‌ ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేయనున్న కోవింద్‌ ఆదివారం జాతి నుద్దేశించి వీడ్కోలు ప్రసంగం చేశారు. 21వ శతాబ్దాన్ని ‘భారత శతాబ్దం’గా మార్చడానికి దేశం సన్నద్ధమవుతోందని అన్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్యతోపాటు ఆర్థిక సంస్కరణలు పౌరులు తమ సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు, ఆనందంగా ఉండేందుకు సాయపడతాయన్నారు.

‘కోవిడ్‌ మహమ్మారి దేశ ఆరోగ్య సంరక్షణ మౌలిక వనరులను మెరుగుపర్చుకోవాల్సిన అవసరాన్ని కల్పించింది. ప్రభుత్వం కూడా ఈ రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం సంతోషకరం. అదేవిధంగా, యువజనులు తమ ఘనమైన వారసత్వాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లడానికి జాతీయ విద్యా విధానం దోహదపడుతుంది. యువ త మూలాలను మరువరాదు’ అని కోరారు. ‘మన పిల్లల కోసం దైనందిన జీవితంలో అవకాశమున్నంత మేర చెట్లు, నదులు, సముద్రాలు, పర్వతాలు, ఇతర జీవరాశుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి.

ప్రథమ పౌరుడిగా, నా తోటి పౌరులకు ఒక సలహా ఇవ్వవలసి వస్తే అది ఇదే అయి ఉంటుంది’ అని కోవింద్‌ అన్నారు. ‘ఒక పూరింట్లో నివసించే ఒక చిన్న పిల్లాడికి దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి గురించి ఎలాంటి అవగాహన ఉండదు. కానీ, మన ఉమ్మడి విధి రూపకల్పనలో ప్రతి పౌరుడు పాలుపంచుకునేలా మార్గాలను సృష్టించడమే దేశ ప్రజాస్వామ్య శక్తికి నిదర్శనం’ అని చెప్పారు.

పరూంఖ్‌ గ్రామానికి చెందిన కోవింద్‌ ఈ రోజు మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించడం ప్రజాస్వామ్య వ్యవస్థల శక్తికి నిదర్శనమన్నారు. విధి నిర్వహణలో తనకు సమాజంలోని అన్ని వర్గాల సహకారం, మద్దతు, ఆశీస్సులు లభించాయని చెప్పారు. డాక్టర్‌ రాజేంద్రప్రసాద్, డాక్టర్‌ ఎస్‌.రాధాకృష్ణన్, డాక్టర్‌ అబ్దుల్‌ కలాం వంటి మహామహుల వారసుడిననే స్పృహతో శాయశక్తులా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాను’ అని తెలిపారు. రాష్ట్రపతి కోవింద్‌ కాబోయే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆదివారం విందు ఇచ్చారు. విందులో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, పలువరు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.   
 

మరిన్ని వార్తలు