వీడియో లీక్ ఘటనపై సీఎం స్పందన: వారితో టచ్‌లో ఉన్నా.. దయచేసి వదంతులు నమ్మొద్దు

18 Sep, 2022 17:12 IST|Sakshi

చండీగఢ్: చండీగఢ్ యూనివర్సిటీలో అమ్మాయిల ప్రైవేటు వీడియోల లీక్ వ్యవహారంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పందించారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించిటన్లు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు.

'చండీగఢ్‌ యూనివర్సిటీ ఘటన దురదృష్టకరం. మన బిడ్డలే మనకు గర్వకారణం. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించాం. దోషులుగా తేలినవారిపై అత్యంత కఠినచర్యలు తీసుకుంటాం. అధికారయంత్రాంగంతో నేను టచ్‌లోనే ఉన్నా. దయచేసి వదంతులు నమ్మొద్దు' అని భగవంత్ మాన్ హిందీలో ట్వీట్ చేశారు.

చండీగఢ్‌ యూనివర్సిటీలో 60 మంది అమ్మాయిల ప్రైవేటు వీడియోలు లీకైనట్లు వార్తలు రావడం తీవ్రదుమారం రేపింది. దీనిపై యూనివర్సిటీ విద్యార్థినులు ఆందోళనకు దిగడం ఉద్రిక్తతలకు దారి తీసింది. అయితే యూనివర్సిటీ యాజమాన్యం ఈ ఆరోపణలను కొట్టి పారేసింది. ఒక్క అమ్మాయి వీడియో మాత్రమే లీకైనట్లు వెల్లడించింది. మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పింది. అలాగే యూనివర్సిటోలో ఏ ఒక్క విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకోలేదని, ఆస్పత్రిలో కూడా చేరలేదని ప్రకటనలో తెలిపింది.
చదవండి: 60 మంది అమ్మాయిల వీడియోలు లీక్‌..? స్పందించిన యూనివర్సిటీ

మరిన్ని వార్తలు