మద్దతుదారులతో చిన్నమ్మ మంతనాలు.. టార్గెట్‌ అదే!

29 Dec, 2022 07:17 IST|Sakshi

అన్నాడీఎంకేతో కలిసే ప్రసక్తే లేదన్న టీటీవీ  

సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ తన మద్దతు దారులతో బుధవారం చెన్నైలో సమావేశమయ్యారు. అదే సమయంలో ఆమె ప్రతినిధి టీటీవీ దినకరన్‌ మీడియాతో మాట్లాడుతూ, అన్నాడీఎంకేతో కలిసే ప్రసక్తేలేదని పేర్కొనడం గమనార్హం. వివరాలు.. అన్నాడీఎంకేలో చీలికల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి టీం బలంగా ఉంది. పన్నీరు సెల్వం శిబిరం ఆ తర్వాతి స్థానంలో ఉందని చెప్పవచ్చు.

ఇక అన్నాడీఎంకే నుంచి చీలికతో ఆవిర్భవించిన అమ్మమక్కల్‌ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్‌ బలోపేతమే లక్ష్యంగా కుస్తీలు పడుతున్నారు. ఇక అన్నాడీఎంకేకు తానే ప్రధాన కార్యదర్శి అని, కోర్టు తీర్పు సైతం తనకు అనుకూలంగా వస్తుందన్న ఆశతో దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ ఉన్నారు. అన్నాడీఎంకేలోని అందరినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేందుకు ఆమె పదేపదే పిలుపునిస్తున్నా స్పందించే వాళ్లు కరువయ్యారు.

గత వారం జరిగిన పన్నీరు శిబిరం సమావేశంలో గానీయండి, మంగళవారం జరిగిన పళనిస్వామి శిబిరం సమావేశంలో కానీయండి ఎవరికి వారు పార్టీని పూర్తిగా తమ గుప్పెట్లోకి తెచ్చుకునే వ్యూహంతో ఉండడంతో చిన్నమ్మ సైతం స్పందించారు. తన మద్దతు దారులతో కలిసి తనదైన వ్యూహ రచనలో నిమగ్నమయ్యారు. బుధవారం చెన్నైలో మద్దతు నాయకులందరిని పిలిపించి తదుపరి కార్యచరణపై దృష్టి పెట్టారు.

లోక్‌ సభ ఎన్నికలలోపు అన్నాడీఎంకేలో ఉన్న వారందరీని ఒకే వేదిక మీదకు తీసుకు వచ్చేందుకు, ప్రజలలోకి చొచ్చుకెళ్లి తన బలాన్ని మరింతగా పెంచుకునే విధంగా చిన్నమ్మ నిర్ణయాలు తీసుకున్నట్టు మద్దతు నేత ఒకరు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, చిన్నమ్మ ప్రతినిధిగా అమ్మమక్కల్‌ మున్నేట్రకళగంకు నేతృత్వం వహిస్తున్న టీటీవీ దినకరన్‌ మీడియాతో స్పందిస్తూ, తాను అన్నాడీఎంకేతో కలిసే ప్రసక్తే లేదని, తన బలాన్ని తాను చాటుకుంటానని పేర్కొనడం గమనార్హం.  

మరిన్ని వార్తలు