పగ తీర్చుకున్నాడు.. కాటేసి చంపేసిన పామును కసితీరా కొరికి.. మెడలో వేసుకుని..

8 Sep, 2022 12:14 IST|Sakshi
మెడలో పాముతో ఊరేగుతున్న సలీమ్‌ నాయక్‌

సాక్షి, భువనేశ్వర్‌: మనిషి పగతో పాము కథ ముగిసింది. మనిషి కాటుతో పాము మృతి చెందింది. ఇది కథ కాదు వాస్తవం. బాలేశ్వర్‌ జిల్లా దొరొడా గ్రామంలో బుధవారం ఉదయం ఈ ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. భోళా శంకరుడి తరహాలో కాటేసి చంపేసిన పామును.. మెడలో వేసుకుని ఊరంతా తిరిగాడు ఓ ప్రబుద్ధుడు. మనసంతా నిండిన ఉక్రోషంతో పాము పట్ల పగ తీర్చుకున్నాడు. ఈ దృశ్యం గ్రామస్తులు, చూపరులను ఆశ్చర్యానికి గురి చేసింది.

వివరాల్లోకి వెళ్తే... బాలేశ్వర్‌ జిల్లా దొరొడా గ్రామానికి చెందిన సలీమ్‌ నాయక్‌ తన పొలంలో బుధవారం ఉదయం తిరుగాడుతుండగా కాలిపై నాగుపాము కాటేసింది. అక్కడి నుంచి పారిపోతున్న సర్పాన్ని.. వెంబడించి పట్టుకున్నాడు. తనకు కాటేసినట్లే తాను కూడా పాముని కాటేసి చంపేయాలనుకున్నాడు. పాము రెండు చివర్లు తల, తోక పట్టుకుని మిగిలిన భాగం అంతా ఎక్కడికక్కడ కొరికేశాడు. మాంసం బయట పడేంత వరకు పట్టు వదలకుండా కొరికి, శాంతించాడు.

బాధ తాళలేని పాము.. తన నోటితో తానే కాటేశాలా చేశాడు. దీంతో చనిపోయిన సర్పాన్ని మెడలో చుట్టుకుని ఊరిలో ఊరేగాడు. ఇది చూసిన వారి నోటమాట రాకుండా నివ్వెర పోయారు. అయితే పాము కాటుకు మాత్రం ఎటువంటి వైద్యం చేసుకోలేదు. పాము మంత్రం తెలిసిన తాంత్రికునిగా చెప్పుకొని, చికిత్స, వైద్యం నిరాకరించాడు. సంప్రదాయం ప్రకారం చంపిన పాముని దహనం చేయకుండా ఖననం చేయనున్నట్లు వివరించాడు. ఈ ఘటన పట్ల వన్యప్రాణుల సంరక్షణ వర్గాలు ఇంతవరకు స్పందించ లేదు.
చదవండి: బొగ్గు కుంభకోణం, బెంగాల్‌ న్యాయమంత్రిపై సీబీఐ

మరిన్ని వార్తలు