సీబీఐ కస్టడీ నుంచి 103 కిలోల బంగారం మాయం!

12 Dec, 2020 19:13 IST|Sakshi

విచారణకు ఆదేశించిన మద్రాసు హైకోర్టు

చెన్నై: తమిళనాడులో కేంద్ర దర్యాప్తు సంస్థ కస్టడీ నుంచి సుమారు రూ. 45 కోట్ల విలువైన బంగారం మాయవడం సంచలనం రేపుతోంది. 2012 నాటి కేసుకు సంబంధించిన 103 కిలోల పసిడి అదృశ్యమైన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై లోతుగా విచారణ చేపట్టాలని మద్రాసు హైకోర్టు తమిళనాడు సీబీ-సీఐడీని ఆదేశించింది. ఆరు నెలల్లో దర్యాప్తు పూర్తిచేసి నివేదిక సమర్పించాలని దేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులకు కేసును అప్పగిస్తే తమ ప్రతిష్ట దిగజారుతుందని సీబీఐ న్యాయస్థానం దృష్టికి తీసుకురాగా.. జస్టిస్‌ పీఎన్‌ ప్రకాశ్‌ వారి అభ్యంతరాన్ని తోసిపుచ్చారు. 

ఈ సందర్భంగా.. ‘‘ పోలీసులు అందరూ నమ్మదగినవారే. సీబీఐకి ఏమీ ప్రత్యేకంగా కొమ్ములు లేవు కదా. అలా లోకల్‌ పోలీసులకు అని తోక మాత్రమే లేదు. సీబీఐకి ఇదొక అగ్నిపరీక్ష వంటిది. ఒకవేళ వాళ్లు సీతలా పవిత్రమైతే.. అవినీతి ఆరోపణల నుంచి విముక్తి పొంది తేజోవంతులై బయటకు వస్తారు. లేనిపక్షంలో దీని కారణంగా ఎదురయ్యే పరిణామాలు ఎదుర్కోకతప్పదు’’ అని ఆయన వ్యాఖ్యానించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. 

అసలు ఈ బంగారం ఎక్కడిది?
చెన్నైలోని సురాణా కార్పొరేషన్‌ లిమిటెడ్‌పై నమోదైన కేసులో భాగంగా 2012లో సీబీఐ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఆ కంపెనీ నుంచి సుమారు 400 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బిస్కట్లతో పాటు ఆభరణాల రూపంలో ఉన్న పసిడిని కంపెనీ వాల్ట్‌లో లాక్‌ చేసి భద్రపరిచారు. ఈ తాళాలను స్థానిక సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి సమర్పించారు. అయితే 2013లో ఈ కంపెనీపై మరో కేసు నమోదు కాగా.. 2012 నాటి కేసులో బంగారం స్వాధీనం అవసరం లేదని, దాన్ని రెండో కేసుకు బదిలీ చేయాలని కోరింది. న్యాయస్థానం నుంచి అనుమతి లభించడంతో అప్పటికే సీబీఐ కస్టడీలో ఉన్న బంగారం గురించి డాక్యుమెంట్లో మార్పులు చేసింది. 

అనేక పరిణామాల అనంతరం రెండేళ్ల తర్వాత అంటే 2015లో సరైన ఆధారాలు లేనందువల్ల సురాణా కంపెనీపై నమోదు చేసిన రెండో కేసును మూసివేస్తున్నట్లు సీబీఐ రిపోర్టు ఇచ్చింది. ఇందుకు సమ్మతించిన న్యాయస్థానం.. ఆ కంపెనీకి చెందిన బంగారాన్ని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌కు అప్పగించాలని ఆదేశించింది. దీంతో తమ బంగారం గురించి సురాణా కంపెనీ మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా.. సురాణా యాజమాన్యం అనేక బ్యాంకుల్లో రుణ ఎగవేతదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా ఈ కేసు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు చేరింది. 

ఈ క్రమంలో గతేడాది డిసెంబరులో.. సీబీఐ ఆధీనంలో ఉన్న సురాణా కంపెనీ బంగారం మొత్తాన్ని, ఆ కంపెనీ రుణం ఎగవేసిన బ్యాంకులకు అందజేయాలని ట్రిబ్యునల్‌ ఆదేశించింది. దీంతో 2020 ఫిబ్రవరిలో బ్యాంకు అధికారుల సమక్షంలో సీబీఐ ఆ లాకర్లు తెరిచింది. అప్పుడు బంగారాన్ని తూకం వేయగా సుమారు 103 కిలోల మేర తక్కువగా ఉండటంతో అందరూ అవాక్కయ్యారు. ఈ విషయం హైకోర్టుకు చేరడంతో ఈ ఘటనపై వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. 

మరిన్ని వార్తలు