నెల రోజుల వ్యవధిలో 26 లక్షలకు పైగా పెళ్లిళ్లు !

17 Nov, 2021 08:44 IST|Sakshi

ఊపందుకున్న పెద్ద పెద్ద పెళ్లిళ్లు, కిటకిటలాడుతున్న దుకాణాలు

కరోనా అనంతరం తిరిగి మామూలు స్థితికి చేరుకున్న వివాహ మహోత్సవాలు

అయ్యా, గట్టి మేళం మోగించండి.. తలంబ్రాలు సిద్ధం చేయండి..  వివాహ భోజనంబు..చందన తాంబూలాలు, పూలు, పండ్లు రెడీ

‘విజయవాడకు చెందిన ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ తన కుమారుడికి ఈఏడాది మొదట్లో ఘనంగా పెళ్లి చేయాలనుకున్నారు. ఇంతలో కరోనా రెండో విడత కమ్ముకొచ్చింది. ఆయన యత్నాన్ని ఆదిలోనే దెబ్బతీసింది’..  
‘కెనడాలోని టొరంటోలో పర్మినెంట్‌ రెసిడెంట్‌గా ఉంటున్న గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన ఓ మధ్య తరగతి యువకుడికి కాకినాడలోని ఓ ప్రభుత్వ ఉద్యోగి కుమార్తెతో పెళ్లి నిశ్చయమైంది. ముందనుకున్న ప్రకారం మే నెలాఖరులో వివాహం జరగాల్సి ఉంది. కానీ కరోనా ఆంక్షలు అడ్డం వచ్చాయి.అయితే ఇప్పుడవి తొలగిపోయాయి.    
– సాక్షి, అమరావతి  

కరోనా కారణంగా విధించిన నిబంధనలను ప్రభుత్వం సడలించడం.. పెళ్లిబంధంతో ఒక్కటవుదామనుకుంటున్న యువతీ యువకుల నెత్తిన అక్షింతలయ్యాయి.ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న లక్షలాది ఇళ్లలో పెళ్లి భాజాభజంత్రీలు మోగుతున్నాయి. కళ్యాణ మండపాలు కళకళలాడుతున్నాయి. బంధుమిత్రుల పలకరింపులు, ఆనంద వినోదాలతో పెళ్లింట కొత్త శోభ సంతరించుకుంటుంది. ఏదేమైనా..ఎక్కడ చూసినా.. రెండేళ్ల నాటి పరిస్థితులు మళ్లీ ఊపందుకుంటున్నాయనేది స్పష్టమవుతున్నది. 

కలిసొచ్చిన వ్యాక్సినేషన్‌..  
కరోనా వైరస్‌ మహమ్మారి నివారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం రాష్ట్రంలో దాదాపు పూర్తి కావడం ఇందుకు ప్రధాన కారణం. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడిన వారిలో 98.86 శాతం మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఫలితంగా రాష్ట్రప్రభుత్వం జనం గుమికూడడంపై ఆంక్షలు సడలించింది. ఈ అవకాశం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రజలు పెద్దఎత్తున పెళ్లిళ్లకు గేట్లు బార్లా తెరిచారు.   

నెల వ్యవధిలో లక్షకు పైమాటే..  
అఖిల భారత ట్రేడర్స్‌ కాన్ఫెడరేషన్‌ అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా నవంబర్‌ 8 నుంచి డిసెంబర్‌ 13వతేదీ లోపు దాదాపు 26 లక్షలకు పైగా వివాహాలు జరుగుతాయని అంచనా. కాగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే లక్షకు పైగా వివాహాలు జరుగుతాయని తెలుస్తున్నది. ఆగస్టులో కరోనా ఆంక్షల్ని స్వల్పంగా సడలించినప్పుడు 13 రోజుల్లో 47 వేలకు పైగా పెళ్లిళ్లు జరగడమే ఈ అంచనాకు ప్రాతిపదిక.   

ఆంధ్రాలో ఆది నుంచీ ఆడంబరమే..  
ఇల్లుకట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే సామెత మనకు ఉండనే ఉంది. దానికి తగ్గట్టుగానే ఆంధ్రాలో పెళ్లిళ్లకు పెట్టే ఖర్చు, ఆడంబరాలు ఆది నుంచీ ఎక్కువే.  ముహూర్త బలానికి గిరాకీ పెరిగిపోతుంది. ఇప్పటికే ఫంక్షన్‌ హాళ్లు ఖాళీలు లేకుండా పోయాయి. నవంబర్‌  21, 27, 28, డిసెంబర్‌ 8 తేదీల్లో స్టార్‌ హోటళ్లలోని హాళ్లు  ఖాళీలు లేవంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.  చాలామంది కార్తీక మాసంలోనే పెళ్లిళ్లు చేయడానికి ఇష్టపడతారని పెళ్లిళ్ల పేరయ్యలు చెబుతున్నారు.   

ధరలు  మండిపోతున్నాయి.. 
ఈ పెళ్లిళ్లు, కార్తీకమాసం పేరిట కూరగాయల ధరలు పెరిగిపోయాయని విజయవాడకు చెందిన ఓ మధ్యతరగతి ఉద్యోగి ఎం.చంద్రశేఖర్‌ వాపోయారు. మంచి ముహూర్తం ఉన్న ఏ రోజూ కూరగాయలు దొరకడం లేదన్నారు. కిలోకి రూ.60,70 పెట్టనిదే ఏ కూరగాయా దొరకడం లేదని, చివరకి గోంగూర కట్ట రూ.10 అయిందని వాపోయారు.    
కార్తీకమాసం, మంచి ముహూర్తాలు కలిసి రావడంతో ఈవెంట్‌ మేనేజ్‌మెంట్లకు గిరాకీ పెరిగింది. కరోనా కాలంలో చిన్నా చితకా ఫంక్షన్లు చేసి మహాఅయితే ఏ 40,50 మందికో భోజనాలు ఏర్పాటు చేసిన వీళ్లకు ఇప్పుడు చేతినిండా పని దొరికినట్టయిందని విజయవాడకు చెందిన ఈవెంట్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు చెప్పారు.

బట్టలు, బంగారు దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. పూల వ్యాపారుల పంట పడింది. పెళ్లి కుమారులు, కుమార్తెలు జిగేల్‌ జిగేల్‌ మంటూ మెరిసిపోతున్నారు. వేద పండితులకు, సన్నాయి వాయిద్య కళాకారులకు గిరాకీ పెరిగింది. ఫ్యాషన్‌ డిజైనర్లు, మేకప్‌మేన్ల కొరత కనిపిస్తోంది. మొత్తం మీద ఖర్చుమాత్రం తడిసిమోపెడవుతున్నా ఎవ్వరూ ఎక్కడా వెనక్కితగ్గడం లేదు.  పెళ్లి వేడుకల్లో గట్టి మేళాలు మోగుతున్నాయి.   

మరిన్ని వార్తలు