సగానికి పైగా పిల్లల్లో కోవిడ్‌ యాంటీబాడీలు

29 Jun, 2021 04:25 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని దాదాపు 51.8 శాతం మంది పిల్లల్లో(1–18 సంవత్సరాల వయసు) కోవిడ్‌వైరస్‌కు వ్యతిరేక యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్లు సీరో సర్వేలో తేలిందని బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) తెలిపింది. ధర్డ్‌ వేవ్‌ వస్తుందన్న భయాల నేపథ్యంలో బీఎంసీ ఈ సర్వేను నిర్వహించింది. ఇందులో భాగంగా ఏప్రిల్‌– జూన్‌ కాలంలో 2,176 బ్లడ్‌ శాంపిల్స్‌ను పరీక్షించారని తెలిపింది.

యాంటీబాడీలున్న పిల్లల సంఖ్య గత సర్వేతో పోలిస్తే పెరిగినట్లు బీఎంసీ తెలిపింది. బీవైఎల్‌ నాయర్‌ హాస్పిటల్, కేఎండీఎల్‌ సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి. సీరో సర్వేలో ప్రజల బ్లడ్‌ సీరమ్‌ను పరీక్షించి ట్రెండ్‌ను అధ్యయనం చేస్తారు. కరోనా ఆరంభం నుంచి ఇది మూడో సీరో సర్వే అని బీఎంసీ వెల్లడించింది. 10–14 సంవత్సరాల వయసు పిల్లల్లో సీరో పాజిటివిటీ అత్యధికంగా 53.43 శాతం ఉందని, 1–4 సంవత్సరాల పిల్లల్లో 51.04 శాతం, 5–9 సంవత్సరాల పిల్లల్లో 47.33 శాతం, 15–18 సంవత్సరాల పిల్లల్లో 51.39 శాతం సీరో పాజిటివిటీ ఉందని తెలిపింది.  

మరిన్ని వార్తలు