60 వేల చేరువలో ఒక్కరోజు కేసులు

27 Mar, 2021 05:22 IST|Sakshi

సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 59,118 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. గతేడాది అక్టోబర్‌ 18 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,18,46,652కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 257 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,60,949కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,12,64,637కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 95.09 శాతానికి చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,21,066గా ఉంది.  

మూడు రాష్ట్రాల్లో..
కొత్త కేసుల్లో 73.64 శాతం కేసులు కేవలం మూడు రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం. వీటిలో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌లు ఉన్నాయి. ఇందులోనూ మహారాష్ట్రలో అత్యధికంగా 35,952 కేసులు నమోదయ్యాయి. దేశంలో 5.5 కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయింది.  

మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ
మహారాష్ట్రలో మరోసారి రాత్రిపూట కర్ఫ్యూను ప్రకటించారు. మార్చి 28వ తేదీ ఆదివారం రాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ నైట్‌ కర్ఫ్యూ అమల్లోకి రానుందని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటించారు. అన్ని షాపింగ్‌మాల్స్‌ రాత్రి 8 నుంచి  ఉదయం 7 గంటల వరకు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కరోనా విస్తరణను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.    

రానున్న పండుగల్లో జాగ్రత్త: కేంద్రం
కరోనా వైరస్‌ ఉధృతి నేపథ్యంలో రానున్న   పండుగ రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు సూచనలు చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా శుక్రవారం ఢిల్లీలో మాట్లాడారు. త్వరలో రానున్న హోలీ, ఈస్టర్, ఈద్‌–ఉల్‌–ఫితర్‌ తదితర పర్వదినాల్లో పౌరులు మరింతగా గుమికూడినపుడు కరోనా వైరస్‌ మరింతగా వ్యాప్తిచెందకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో దేశం ప్రస్తుతం కీలక దశలోకి చేరుకుందని ఈ దశలో అలసత్వం ప్రదర్శించడం మంచిదికాదన్నారు. స్కూళ్లు, కాలేజీలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్, జిమ్‌లు, ఎగ్జిబిషన్‌లు వంటి వాటికి సంబంధించి ఈ నెల 23న హోంశాఖ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసిందని వాటిని అనుసరించాలని సూచించారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు