రెండో స్థానంలోకి భారత్‌

8 Sep, 2020 03:32 IST|Sakshi

42లక్షలు దాటిన కేసులు..

రెండో రోజూ 90వేలకు పైగా కేసులు

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌–19 కేసుల్లో అమెరికా తర్వాత భారత్‌ రెండో స్థానంలోకి చేరింది. కేసుల సంఖ్య దృష్ట్యా బ్రెజిల్‌ను దాటిపోయింది. ఈ క్రమంలో వరుసగా రెండో రోజు కూడా భారత్‌లో 90 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.   కేవలం 24 గంటల్లో 90,802 కేసులు బయ టపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 42,04,613కు చేరుకుంది.

గత 5 రోజులుగా రోజుకు 80 వేలకు పైగా కేసులు, రెండు రోజులుగా 90 వేలకు పైన కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 69,564 మంది కోలుకోగా 1,016 మంది మరణిం చారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 71,642కు చేరుకుందని కేంద్రం తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 32,50,429 కాగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 8,82,542గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 20.99% ఉన్నాయి. రికవరీ రేటు  77.30% పెరగ్గా, మరణాల రేటు 1.70%కి పడిపోయింది.

యాంటీబాడీలు ఉన్నా కరోనా..
శరీరంలో కరోనా యాంటీబాడీలు ఉన్నంత మాత్రాన కోవిడ్‌ సోకే ముప్పు తగ్గుతుందని చెప్పలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని మీద ఉన్నవన్నీ ఊహాగానాలేనని, ఆధారసహిత ప్రయోగాలు లేవని అంటున్నారు. కరోనా సోకి కోలుకున్న వారు తిరిగి కరోనా బారిన పడటం పట్ల ఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యూనోలజీ నిపుణులు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. యాంటీబాడీలు కరోనాను పూర్తిస్థాయిలో నిరోధించడం లేదని చెప్పారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సర్వేలు, ప్రస్తుతమున్న కేసుల కంటే ఇంకా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నాయని అన్నారు. శరీరంలో ఉన్న యాంటీబాడీల స్థాయిని తెలుసుకోకుండా కేవలం పాజిటివ్‌ లేదా నెగెటివ్‌ అని చెప్పడం వల్ల పూర్తి వివరాలు తెలియడం లేదన్నారు.  

ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేస్తాం..
కోవిడ్‌ వ్యాక్సిన్‌ వచ్చాక ప్రపంచవ్యాప్తంగా పేద దేశాలకు తాము సాయం అందిస్తామని యూనిసెఫ్‌ ప్రకటించింది. ఇప్పటికే మీజిల్స్, పోలియో వంటి వ్యాధులకు ఏటా 2 బిలియన్ల వ్యాక్సిన్లు కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నామని చెప్పింది. కరోనా టీకా వచ్చాక దాదాపు 100 దేశాలకు సాయం అందిస్తామని చెప్పింది. దీని కోసం  అమెరికావ్యాప్త ఆరోగ్య సంస్థ (పహో)తో కలసి కోవాక్స్‌ టీకా కోసం ఎందురు చూస్తున్నట్లు చెప్పింది.

మలైకా అరోరాకు కోవిడ్‌ పాజిటివ్‌
బాలీవుడ్‌ నటి, వీడియో జాకీ, మోడల్‌ కూడా అయిన మలైకా అరోరా(46)కు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో, కోవిడ్‌ ప్రొటోకాల్‌ను అనుసరించి, వైద్యుల సలహా మేరకు తన ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నట్లు ఆమె సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు.

మరిన్ని వార్తలు