'జడ్‌' కేటగిరి భద్రతను తిరస్కరించిన ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ

5 Feb, 2022 05:54 IST|Sakshi

‘ఎ’ కేటగిరీ పౌరునిగా బతకనిస్తే చాలు

ఆంక్షలతో బతకలేను, చావుకు భయపడను

దుండగులపై యూఏపీఏ పెట్టాలని డిమాండ్‌

ఇద్దరిని అరెస్టు చేసిన యూపీ పోలీసులు

కాల్పులపై సోమవారం సభలో కేంద్రం ప్రకటన

సాక్షి, న్యూఢిల్లీ: యూపీ కాల్పుల నేపథ్యంలో హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ  కి జెడ్‌ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించగా ఆయన దాన్ని తిరస్కరించారు. తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని శుక్రవారం లోక్‌సభలో కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. దేశంలో పెరిగిపోతున్న రాడికలిజానికి ముగింపు పలకాలన్నారు. తనపై జరిగిన బుల్లెట్‌ దాడికి యూపీ ఓట్లరు బ్యాలెట్‌తో బదులిస్తారన్న నమ్మకం తనకుందన్నారు.

‘‘నాకు జెడ్‌ కేటగిరీ రక్షణ వద్దు. మీ అందరితో సమానంగా ఎ కేటగిరీ పౌరునిగా బతికే అవకాశం కల్పిస్తే చాలు. రెండుసార్లు ఎమ్మెల్యే, నాలుగుసార్లు ఎంపీ అయిన నాపై కేవలం ఆరడుగుల దూరం నుంచి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. నేను పుట్టింది ఈ భూమ్మీదే. చచ్చినా ఔరంగాబాద్‌ గడ్డ మీదే పూడుస్తారు. కాల్పులకు భయపడను. బుల్లెట్‌ తాకినా ఇబ్బంది లేదు గానీ ఆంక్షలతో కూడిన జీవితం గడపడం నాకు నచ్చదు. స్వతంత్రుడిగా బతకాలనుకుంటున్నా.

నేను బతకాలంటే నా మాట బయటకు రావాల్సిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిందే. దేశంలోని మైనార్టీలు, పేదలు, బలహీన వర్గాలకు భద్రత లభిస్తే నాకు లభించినట్లే’’ అన్నారు. దేశ ప్రధాని భద్రతలో వైఫల్యం తలెత్తినప్పుడు ఇతర విపక్షాల కంటే ముందు తానే దాన్ని తప్పుపట్టానని గుర్తు చేశారు.‘‘నాపై దాడి చేసిన వారికి బుల్లెట్‌పైనే తప్ప ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై నమ్మకం లేదు. ఫేస్‌బుక్‌లో ఎవరైనా ఒక క్రికెట్‌ జట్టును అభినందిస్తే చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని (యూఏపీఏ) ప్రయోగిస్తున్నారు.

నాపై దాడి చేసిన వారిపై ఎందుకు ప్రయోగించరు? తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిపై ఎందుకు ప్రయోగించరు’’ అని కేంద్రాన్ని ప్రశ్నించారు. కాల్పులపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఈసీని ఇప్పటికే అసద్‌ కోరారు. గురువారం ఉత్తర యూపీలో ఎన్నికల కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఒవైసీ కారుపై కాల్పులు జరగడం తెలిసిందే. ‘‘ఈ నేపథ్యంలోనే ఒవైసీకి ఉన్న ముప్పు స్థాయిని పునఃసమీక్షించి, జెడ్‌ కేటగిరీ భద్రత ఇవ్వాలని నిర్ణయించాం. సీఆర్పీఎఫ్‌ అధికారులు ఒవైసీ నివాసానికి వెళ్లి ఈ నిర్ణయాన్ని ఆయనకు తెలియజేస్తారు’’ అని కేంద్ర హోం శాఖ వర్గాలు శుక్రవారం తెలిపాయి.

ఇద్దరి అరెస్టు
ఒవైసీపై కాల్పులకు సంబంధించి ఇద్దరిని యూపీ పోలీసులు అరెస్టు చేశారు. ఒకరిని గౌతంబుద్ధ నగర్‌కు చెందిన సచిన్‌గా, మరొకరిని సహరన్‌పూర్‌కు చెందిన శుభంగా గుర్తించినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. ఒవైసీ, ఆయన పార్టీ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కోపంతోనే దాడికి పాల్పడ్డట్టు విచారణలో వారు చెప్పారన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వీరిని పట్టుకున్నాం. ఒక మారుతి ఆల్టో కారు, రెండు పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నాం. పలు పోలీసు బృందాలు కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి’’ అని వివరించారు. కాల్పులపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సోమవారం లోక్‌సభలో ప్రకటన చేస్తారని మరో మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పారు. అసద్‌పై కాల్పులను తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. ‘‘ఇది పిరికిపందల మతిలేని చర్య. అసద్‌ భాయ్‌! మీరు క్షేమంగా ఉన్నందుకు సంతోషం’’ అని ట్వీట్‌ చేశారు.

జెడ్‌ కేటగిరీ అంటే...
► ప్రధానికి రక్షణ కల్పించే ఎస్‌పీజీని పక్కన పెడితే జెడ్‌ ప్లస్‌ తర్వాత మన దేశంలో రెండో అత్యున్నత స్థాయి భద్రత జెడ్‌ కేటగిరీ
► అధిక ముప్పున్న నాయకులు, ప్రముఖులకు కేంద్రం ఈ భద్రత కల్పిస్తుంది
► సీఆర్పీఎఫ్‌ కమాండోలు 24 గంటల పాటూ రక్షణగా ఉంటారు
► 16 నుంచి 22 మంది షిఫ్టుల్లో పని చేస్తారు
► రోడ్డు ప్రయాణాల్లో ఒక ఎస్కార్ట్, మరో     పైలట్‌ వాహనం సమకూరుస్తారు
► ఈ భద్రతకు నెలకు రూ.16 లక్షలకు పైగా ఖర్చవుతుంది 

చదవండి: ఒవైసీపై దాడి.. కేంద్రం కీలక నిర్ణయం

చదవండి: (అసదుద్దీన్‌ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పులు)

మరిన్ని వార్తలు