ఆస్ట్రాజెనె‌కా వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేతపై సీరం స్పందన

9 Sep, 2020 17:25 IST|Sakshi

దేశంలో వ్యాక్సిన్ ట్రయల్స్‌ నిలిపివేయలేదు : సీరం

కరోనా  వ్యాక్సిన్ ట్రయల్స్ ఇండియాలో కొనసాగుతున్నాయి

సాక్షి, న్యూఢిల్లీ: ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ భాగ‌స్వామ్యంతో రూపొందుతున్న ఆస్ట్రాజెనె‌కా కరోనా వ్యాక్సిన్ చివ‌రి ద‌శ పరీక్షలను నిలిపివేస్తున్నట్టు వచ్చిన వార్తలపై ఫార్మా దిగ్గజం సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్పందించింది. ఆక్స్‌ఫ‌ర్డ్, ఆస్ట్రాజెనెకా రూపొందించిన కోవిడ్-19  వ్యాక్సిన్ ట్రయిల్స్ భారత్‌లో నిలిపి వేయలేదని వివరించింది. పరీక్షలు కొనసాగుతున్నాయనీ ఎలాంటి సమస్యలు ఎదురు కాలేదని సీరం స్పష్టం చేసింది. కరోనా వైరస్ ఆస్ట్రాజెనెకా టీకా పరీక్షలకు సంబంధించి యూకేలో ట్రయల్స్‌ను నిలిపివేస్తున్నట్లు వచ్చిన నివేదికలపై వ్యాఖ్యానించేందుకు సీరం నిరాకరించింది. ప్రస్తుతానికి బ్రిటన్లో పరీక్షలను నిలిపివేసినా.. త్వరలోనే పునఃప్రారంభమవుతాయని ఆశిస్తున్నట్టు తెలిపింది. అయితే భారత విషయానికి వస్తే ట్రయల్స్‌కు ఎలాంటి ఆటంకం లేదని పేర్కొంది. 

కాగా ఆక్స్‌ఫ‌ర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ క్లినిక‌ల్ ట్రయ‌ల్స్‌లో భాగంగా బ్రిట‌న్‌లో ఈ టీకా తీసు‌కున్న వ‌లంటీర్లకు ఆరోగ్య స‌మ‌స్యలు త‌లెత్తాయి. దీంతో తుది ద‌శ  ట్రయ‌ల్స్‌ను ప్ర‌స్తుతానికి నిలిపివేస్తున్న‌ట్లు ఆస్ట్రాజెనెకా అధికారికంగా ప్ర‌క‌టించింది. ప్ర‌యోగ ప్రామాణిక ప్ర‌క్రియ‌, వ్యాక్సిన్ భ‌ద్ర‌త‌పై పూర్తిస్థాయి స‌మీక్ష కోసం ఈమేర‌కు నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపింది. దీంతో ప‌లు దేశాల్లో జ‌రుగుతున్న ఈ వ్యాక్సిన్  ప్రయోగం నిలిచిపోయింది. క‌రోనా వ్యాక్సిన్ రేసులో ఆక్స్‌ఫ‌ర్డ్ టీకా ముందువ‌రుస‌లో ఉంది. ఈ టీకాకు సంబంధించి మనదేశంలో ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రయోగాలకు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ)కు  డీసీజీఐ అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు