‘ఊపిరి’ ఆగింది.. గాల్లోకి 22 ప్రాణాలు

22 Apr, 2021 01:14 IST|Sakshi

మహారాష్ట్రలో ఆక్సిజన్‌ అందక 24 మంది కోవిడ్‌ రోగుల మృతి

ఆసుపత్రిలో ఆక్సిజన్‌ లీక్‌... నిలిచిన సరఫరా

విలవిల్లాడి ప్రాణాలొదిలిన అభాగ్యులు

నాసిక్‌లోని మున్సిపల్‌ ఆసుపత్రిలో దుర్ఘటన..

సాక్షి ముంబై: మహారాష్ట్ర నాసిక్‌లో అత్యంత హృదయ విదారకమైన సంఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని ఆక్సిజన్‌ ట్యాంకుకు లీకేజీ ఏర్పడి ప్రాణవాయువు అందక 24 మంది కోవిడ్‌ రోగులు ప్రాణాలు కోల్పోయారు. నాసిక్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన జాకీర్‌ హుస్సేన్‌ ఆసుపత్రిలో బుధవారం ఈ దారుణం చోటుచేసుకుంది. దుర్ఘటన జరిగిన సమయంలో ఆసుపత్రిలో 150 మంది ఉండగా... అందులో 11 మంది వెంటిలేటర్‌పై... మిగతా వారు ఆక్సిజన్‌ సపోర్టుపై ఉన్నారు. ఉన్నట్లుండి ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోవడంతో ఆసుపత్రి బెడ్స్‌పై గిలగిల్లాడుతూ ప్రాణాలు వదిలారు ఈ అభాగ్యులు. లీకేజీ జరిగిన కొద్దిసేపట్లోనే 22 మంది మరణించారు. వీరిలో 11 మంది మహిళలు, 11 మంది పురుషులు ఉన్నారు. అనంతరం సాయంత్రం మరో ఇద్దరు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో 34 నుంచి 77 ఏళ్ల వయసు వాళ్లు ఉన్నారని తెలిపారు. బుధవారం 12.30 గంటల ప్రాంతంలో లీకేజీ గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది... ప్రత్యామ్నాయ సిలిండర్లను తెప్పించి ఆక్సిజన్‌ సరఫరాను పునరుద్ధరించారు. ఈలోపే ఘోరం జరిగిపోయింది. సీరియస్‌గా ఉన్న పేషెంట్లను మరోచోటికి తరలించేందుకు బ్బంది పరుగులు పెట్టడం, ఏం జరుగుతుందో తెలియక రోగుల బంధువుల అర్తనాదాలతో ఆసుపత్రి ఆవరణలో గందరగోళం నెలకొంది. మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ దుర్ఘటనలో మొత్తం 24 మంది చనిపోయారని నాసిక్‌ కలెక్టర్‌ సూరజ్‌ మందారే విలేకరులకు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ సంఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

అసలేమి జరిగింది? 
నాసిక్‌లోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆసుపత్రి అయిన జాకీర్‌ హుస్సేన్‌ ఆసుపత్రిలో 150 మంది కోవిడ్‌ రోగులు చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి ఆవరణలో 13 కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్‌ ట్యాంకు ఉంది. బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆక్సిజన్‌ ట్యాంక్‌ సాకెట్‌ ఒకటి విరిగి లీకేజీ ప్రారంభమైంది. అయితే ట్యాంకర్‌ ద్వారా ట్యాంకులో ఆక్సిజన్‌ నింపుతుండగా ఇది జరిగిందనేది మరో వాదన. ఇది చూస్తుండగానే అధికమైంది. 12.30 ప్రాంతంలో ఆక్సిజన్‌ భారీగా లీకవ్వడం మొదలైంది. దీంతో అందరూ ముందుగా భయాందోళనలకు గురయ్యారు. అనంతరం ఈ లీకేజీని అరికట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కాని లీకేజీ ఆగలేదు. అప్పటికి ట్యాంకులో 25 శాతం మేర మాత్రమే ఆక్సిజన్‌ ఉండగా... లీకేజీతో అది ఇంకా తగ్గిపోయింది. ట్యాంకులో ప్రెషర్‌ తగ్గి... పేషెంట్లకు ఆక్సిజన్‌ అందలేదు. మరోవైపు ఆసుపత్రిలో అరుపులు, కేకలు ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు ఆక్సిజన్‌ లీకేజీ కారణంగా ఇటువైపు ఉన్న అందరి దృష్టి ఒక్కసారిగా అటువైపు మళ్లింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనేక మంది రోగులు ఆక్సిజన్‌ అందక నీటి నుంచి బయటపడ్డ చేప పిల్లల్లా కొట్టుకోసాగారు. అక్కడే ఉన్న వారి కుటుంబసభ్యులు, నర్సులు, వైద్యులు ఈ సంఘటనతో అవాక్కయ్యారు.

అందుబాటులో ఉన్న సిలిండర్లతో ఆక్సిజన్‌ అందించేందుకు ప్రయత్నించారు. ఇతర ఆసుపత్రులు నుంచి హుటాహుటిన డ్యూరా సిలిండర్లను తెప్పించారు. ఈ సమయంలో ఆసుపత్రి వర్గాలు కొందరు రోగులకు వేరే ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు కూడా చేపట్టారు. ఆక్సిజన్‌ ట్యాంకు నిర్వహణ బాధ్యతను చూస్తున్న ప్రైవేటు కంపెనీకి సమాచారం ఇచ్చి వారిని పిలిపించారు. ఇలా సుమారు గంటకుపైగా చేసిన ప్రయత్నాలు అనంతరం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో లీకేజీని ఆపగలిగారు. కాని అప్పటికే జరగరాని ఘోరం జరిగింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు. ఏకంగా 24 మంది ఆక్సిజన్‌ అందక మృతి చెందారు. ఈ సంఘటన అనంతరం బంధువుల ఆర్తనాదాలు, రోదనలతో ఆ పరిసరాలలో విషాదం అలుముకుంది.

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు
అత్యంత విషాదకరమైన ఈ సంఘటన అనంతరం మృతుల కుటుంబీకులకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే రూ. అయిదు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ సంఘటన అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా పేర్కొంటూ... ఏం మాట్లాడాలన్నా మాట పెగలడం లేదన్నారు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంథించి అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి దోషులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దుర్ఘటనపై విచారణకు ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో కమిటీని నియమించింది. మరోవైపు ఈ సంఘటన అనంతరం ఆసుపత్రికి చేరుకున్న నాసిక్‌ జిల్లా ఇంచార్జీ మంత్రి ఛగన్‌ భుజ్‌బల్‌ కూడా మృతుల కుటుంబీకులకు నాసిక్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ తరఫున రూ. అయిదు లక్షల మద్దతు అందించనున్నట్టు ప్రకటించారు. ఇలా మొత్తం రూ.10 లక్షలు మృతుల కుటుంబీకులకు ఆర్థిక సహాయం అందనుంది.  
 
రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి 
న్యూఢిల్లీ: ఆక్సిజన్‌ సరఫరాలో ఆటంకాలు ఏర్పడి 24 మంది కోవిడ్‌ రోగులు మృతిచెందడంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘గుండెలను మెలిపెట్టే దురదృష్టకర సంఘటన. తీవ్ర వేదనను కలిగించింది. ఆత్మీయులకు కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను..’అని మోదీ ట్వీట్‌ చేశారు. హోంమంత్రి అమిత్‌ షా కూడా సంతాపం ప్రకటించారు. మిగిలిన పేషెంట్లు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు.

నిర్లక్ష్యం కారణంగానే..
ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన చోటుచేసుకుందని మృతుల కుటుంబీకులు ఆరోపించారు. 60 ఏళ్ల తన తల్లిని మంగళవారమే ఈ ఆసుపత్రిలో చేర్చించామని, ఆమె వెంటిలేటర్‌పై ఉందని... ఇలా చనిపోవడానికి ఆమెను ఇక్కడ చేర్పించలేదని లీలా సర్కార్‌ అనే మహిళ గుండెలవిసేలా రోదించారు. ఊపిరి ఆడట్లేదని అమ్మ చెప్పగానే... నర్సింగ్‌ సిబ్బందిని పిలిచానని, ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. మరోవైపు తన తమ్ముణ్ని రక్షించుకోలేకపోయానంటూ మరోవ్యక్తి రోదించడం అక్కడున్న వారికి కన్నీళ్లు తెప్పించింది. ఆక్సిజన్‌ సరిగా సరఫరా కావడంలేదని ముందునుంచే తెలుపుతూ వచ్చామని, అయినా ఆసుపత్రి వారు పట్టించుకోలేదని మరి కొందరు వాపోయారు. ఆసుపత్రి నిర్లక్ష్యానికి ఇంత మంది మరణించారని ఆరోపించారు.

చదవండి: ప్రశ్నలు సంధించాల్సిన సమయమిది
చదవండి: ప్రపంచ విప్లవోద్యమ చుక్కాని లెనిన్‌

మరిన్ని వార్తలు