P Chidambaram: కిర‌ణ్ రిజిజుకు గట్టి కౌంట‌ర్ ఇచ్చిన చిదంబ‌రం

12 May, 2022 15:35 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు లక్ష్మణ రేఖ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి చిదంబరం తీవ్రంగా స్పందించారు. రాజద్రోహం చట్టం విషయంలో సుప్రీంకోర్టుకు లక్ష్మణ రేఖ గీసే అధికారం కేంద్ర న్యాయశాఖ మంత్రికిరణ్‌ రిజిజుకు లేదని ఘట్టి కౌంటర్‌ ఇచ్చారు. రాజ్యాంగంలోని 13వ సెక్షన్‌ను చదువుకోవాలని కేంద్ర మంత్రికి చిదంబరం హితవు పలికారు. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ప్రభుత్వాలు చట్టాలను చేయలేవని అలాంటి చట్టాలను అనుమతించరని చిదంబరం అన్నారు. దేశద్రోహ చట్టం రాజ్యాంగంలోని 19, 21 ఆర్టికల్స్‌ను ఉల్లంఘిస్తోందని, రాజుల గుర్రాలు, రాజులందరూ ఆ చట్టాన్ని రక్షించలేరని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

కాగా న్యాయశాఖతో సహా రాజ్యాంగ వ్యవస్థలన్నీ లక్ష్మణరేఖ దాటకూడదని కేంద్ర న్యాయ మంత్రి కిరణ్‌ రిజిజు అభిప్రాయపడ్డారు. తాము త‌దుప‌రి ఉత్త‌ర్వులు ఇచ్చే వ‌ర‌కూ రాజ‌ద్రోహం న‌మోదు చేయ‌రాద‌నిసుప్రీం వ్యాఖ్యానించింది. అయితే దేశద్రోహ చట్టంపై సుప్రీంకోర్టు స్టే విధించడంపై బుధవారం మీడియా ప్రశ్నలకు బదులిస్తూ ఆయన ఈ మేరకు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘‘కోర్టులు ప్రభుత్వాన్ని, శాసన వ్యవస్థను గౌరవించాలి. ప్రభుత్వం కూడా కోర్టులను గౌరవించాలి. ఈ మేరకు స్పష్టమైన లక్ష్మణరేఖను రాజ్యాంగం ఎప్పుడో నిర్దేశించి ఉంచింది. దాన్ని ఎవరూ మీరకూడదు’’ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు దేశ సార్వభౌమత్వం, సమగ్రతలకు భంగం కలగని రీతిలో దేశద్రోహ చట్టాన్ని పునఃసమీక్షిస్తామని చెప్పారు. దీన్ని సాహసోపేతమైన చర్యగా అభివర్ణించారు. చట్టాలు చేయడం ప్రభుత్వ బాధ్యతన్నారు.

మరిన్ని వార్తలు