వైరల్‌: పి. మమతా బెనర్జీ వెడ్స్‌ ఏఎం సోషలిజం...

10 Jun, 2021 20:34 IST|Sakshi

నెట్టింట వైరల్‌గా మారిన వివాహ ఆహ్వాన పత్రిక

చెన్నై: ప్రస్తుత కాలంలో వివాహ వేడుకను అత్యంత వైభవంగా.. చాలా భిన్నంగా చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. అందుకే పెళ్లికి సంబంధించిన ప్రతి అంశాన్ని వెరైటీగా ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి పత్రికలను వినూత్నంగా రూపొందించుకుంటున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన ఓ వివాహ ఆహ్వాన పత్రిక నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఎందుకంటే ఇక్కడ వధువు పేరు మమతా బెనర్జీ కాగా.. వరుడు పేరు సోషలిజం. అసలు ఈ పేర్లు, పెళ్లి పత్రిక నిజమా కాదా తెలుసుకునే ప్రయత్నం చేశారు నెటిజనులు. దంపతులు తల్లిదండ్రులు ఈ పేర్లు వాస్తవమే అని వెల్లడించారు. వరుడు తమిళనాడు సేలం సీపీఐ జిల్లా కార్యదర్శి ఏ మోహన్‌గా ప్రసిద్ది చెందిన లెనిన్ మోహన్ కుమారుడు. మోహన్ సేలం లోని పనమరతుపట్టి పట్టణ కౌన్సిలర్ కూడా.

ఈ సందర్భంగా మోహన్ తన కొడుకుకు ఇలాంటి పేరు పెట్టడం వెనుక గల కారణాలు, తన కుటుంబం ఈ సంప్రదాయాన్ని ఎలా కొనసాగిస్తున్నారో వివరించారు. “సోవియట్ యూనియన్ రద్దు అయిన తరువాత, కమ్యూనిజం పడిపోయిందని.. భావజాలం ప్రపంచంలో ఎక్కడా వృద్ధి చెందదని ప్రజలు భావించారు. దీనికి సంబంధించి దూరదర్శన్‌లో ఒక న్యూస్ క్లిప్ కూడా ఉంది. ఆ సమయంలో, నా భార్య నా పెద్ద కొడుకుకు జన్మనిచ్చింది. మానవ జాతి ఉనికిలో ఉన్నంతవరకు కమ్యూనిజం ఉంటుందని నేను నమ్ముతున్నాను. అందుకే నా పెద్ద కుమారుడికి కమ్యూనిజం అని పేరు పెట్టాలని నేను వెంటనే నిర్ణయించుకున్నాను” అని తెలిపారు మోహన్‌

గ్రామమంతా ఇదే సంప్రదాయం...
కత్తూరు గ్రామంలో, ఎక్కువ మంది ప్రజలు కమ్యూనిజం మార్గాన్ని అనుసరిస్తున్నారని.. అందువల్ల ఇక్కడ రష్యా, మాస్కో, చెకోస్లోవేకియా, రొమేనియా, వియత్నాం, వెన్మానీ వంటి పేర్లు గల వ్యక్తులు తారసడటం సాధారణం అన్నారు మోహన్‌. “ప్రజలు తమ అభిమాన నాయకులు, దేశాలు, భావజాలాలు పేర్లు పిల్లలకు పెడతారు. అలానే నేను నా పిల్లలకు నా  అభిమాన భావజాలం పేరు పెట్టాలనుకున్నాను. ముగ్గురు కుమారులకు ఒకేలాంటి పేరు పెట్టాను. ఇక వధువు కూడా మా బంధువు. ఆమె తాత కాంగ్రెస్ సభ్యుడు, మమతా బెనర్జీ నుంచి ఎంతో ప్రేరణ పొందాడు. దాంతో తన మనవరాలికి దీదీ పేరు పెట్టుకున్నాడు.. మన భవిష్యత్ తరాలు మన భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలని మేమందరం కోరుకుంటున్నాం. అందుకే నా మనవడికి మార్క్సిజం అని పేరు పెట్టాను. భవిష్యత్తులో, మా కుటుంబంలో ఒక ఆడపిల్ల పుడితే, నేను ఆమెకు క్యూబాయిజం అని పేరు పెడతాను” అని మోహన్ తెలిపారు.

మూడు రోజుల్లో 300 కాల్స్‌...
కోవిడ్ మహమ్మారి కారణంగా పెళ్లికి అందరిని ఆహ్వానించే వీలు లేక వివాహ పత్రికను ఇలా పేపర్‌లో ప్రచురించమన్నారు మోహన్‌. పెళ్లి పత్రికను వారు సీపీఐ అనుబంధ  పత్రిక ‘జన శక్తి’ లో ప్రచురించారు. 2016లో మోహన్ రెండవ కుమారుడి వివాహం సందర్భంగా కూడా ఇలానే చేశారు. ‘‘ఈ వివాహ ఆహ్వానాన్ని సోమవారం పేపర్‌లో ప్రచురించాం. గత మూడు రోజుల్లో, నాకు 300 కి పైగా కాల్స్ వచ్చాయి. అందరూ వధూవరుల పేర్లపై చాలా ఆసక్తి కనబరిచారు. ఇది నిజమా, కాదా అని తెలుసుకోవాడానికి కార్యకర్తలు, స్నేహితులు, మీడియా నుంచి చాలా మంది నాకు కాల్‌ చేశారు. అందరూ ఇదే ప్రశ్న అడగటంతో మొదట్లో నేను చాలా చిరాకు పడ్డాను, కాని తరువాత అలవాటు పడ్డాను, ”అని తెలిపాడు మోహన్‌.

స్కూల్‌లో ఇబ్బంది పడ్డారు..
"పేర్ల విషయంలో నా కుమారులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి వెరైటీ పేర్లు పెట్టుకున్నందుకు చిన్నతనం నుంచి ప్రతి ఒక్కరూ నా కుమారులను అభినందించేవారు. వీరంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నారు. చాలా సార్లు రికార్డుల్లో వారి పేర్లను తప్పుగా రాశారు. వారి పాఠశాల విద్యను పూర్తయ్యేవరకు ఇది కొనసాగింది. కాని కళాశాలలో, పరిస్థితి మెరుగుపడింది. నా పెద్ద కొడుకు చెన్నై కాలేజీలో లా చేసాడు, మిగతా ఇద్దరు బి.కామ్ చేసారు. తరతరాలుగా మేము ఈ భావజాలాన్ని అనుసరిస్తున్నందున పేర్ల వెనక గల కథను వినడానకి ఆసక్తి కనబరిచేవారు’’ అని తెలిపారు మోహన్‌. 

చదవండి: ఐతారం నాడు లగ్గం.. అర్సుకునేటోల్లు వీళ్లే

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు