అరకొరగానే వరి! కారణాలివేనా? రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

15 Jul, 2022 02:29 IST|Sakshi

దేశవ్యాప్తంగా భారీగా తగ్గిన సాగు

గతేడాది 94.99 లక్షల హెక్టార్లలో నాట్లు

ఈసారి ఏకంగా 24 శాతం మేర తగ్గుదల

ఇంత తగ్గుదల పదేళ్లలో ఇదే తొలిసారి

తెలంగాణలోనూ 40 వేల హెక్టార్లు తగ్గింది

వరి సాగు పెంచేలా చూడాలన్న కేంద్రం

సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో దేశవ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. గత దశాబ్ద కాలంలో తొలిసారిగా ఈ ఏడాది వరి సాగు 24 శాతం మేర తగ్గినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
    
గత ఏడాదితో పోలిస్తే జూలై 8 నాటికి తెలంగాణలోనూ వరి సాగు తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. జూన్‌లో రుతుపవనాల రాకలో జాప్యం జరగడం, పప్పు ధాన్యాలు, నూనెగింజల మద్దతు ధరలను ప్రభుత్వం భారీగా పెంచిన నేపథ్యంలో వాటి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నట్లు కేంద్రం అంచనా వేస్తోంది.

పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి
ఈ నెల 8న వ్యవసాయ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. గత ఏడాది ఈ సమయానికి దేశవ్యాప్తంగా 94.99 లక్షల హెక్టార్లలో వరి నాట్లు వేశారు. అయితే ఈ ఏడాది కేవలం 72.24 లక్షల హెక్టార్లలో (24% తక్కువ) మాత్రమే వరి నాట్లు పడ్డాయి. 2012 జూలై 11 నాటికి 96.7 లక్షల హెక్టార్లలో వరి సాగవగా, ఆ తర్వాత ఏడాదిలో గరిష్టంగా 1.25 కోట్ల హెక్టార్ల మేర సాగు జరిగింది. వరి ఎక్కువగా సాగు చేసే ఛత్తీస్‌గఢ్‌లో గత ఏడాది ఇదే సమయానికి 15.14 లక్షల హెక్టార్లలో సాగు జరగ్గా, ఈ ఏడాది ఏకంగా 6.19 లక్షల హెక్టార్ల మేర తగ్గి కేవలం 8.95 లక్షల హెక్టార్లకే పరిమితం అయ్యింది. తెలంగాణలో గత ఏడాది జూలై 8 నాటికి 93 వేల హెక్టార్లలో వరి వేయగా, ఈ ఏడాది కేవలం 53 వేల హెక్టార్లలో మాత్రమే సాగయ్యింది.

వరికి స్వల్పం..ఇతర పంటలకు భారీగా..
రుతుపవనాల వైఫల్యానికి తోడు ఈ ఏడాది వరి మద్దతు ధరను కేవలం రూ.100 మాత్రమే పెంచడం..రైతులు వరి సాగుకు మొగ్గు చూపక పోవడానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. మరోవైపు వంట నూనెలు, పప్పుధాన్యాల దిగుమతిని తగ్గించేందుకు, దేశీయంగా నూనె గింజల దిగుబడిని పెంచేలా వాటి మద్దతు ధరలను కేంద్రం గణనీయంగా పెంచింది.  ఈ కారణంగానే రైతులు వరి సాగును తగ్గించినట్లు తెలుస్తోంది.

రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
వరి సాగు విస్తీర్ణం తగ్గితే దాని ప్రభావం జాతీయ ఆహార భద్రతా చట్టం కింద నిరుపేదలకు సరఫరా చేసే బియ్యం పంపిణీపై పడే ప్రమాదముంది. ఈ దృష్ట్యా రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వరి నాట్లు పెంచాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్‌ గోయల్‌  రాష్ట్రాలను కోరారు. దేశంలో బియ్యం నిల్వలకు కొరత లేదని, అంతర్జాతీయ డిమాండ్‌ దృష్ట్యా, ఎక్కువ ఉత్పత్తి చేస్తే  మంచి ధర వస్తుందని తెలిపారు.

మరిన్ని వార్తలు