పద్మశ్రీ రాధామోహన్‌ ఇకలేరు

12 Jun, 2021 17:30 IST|Sakshi

భువనేశ్వర్‌: పద్మశ్రీ ప్రొఫెసర్‌ రాధా మోహన్‌ స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్‌ ప్రొఫెసర్‌ గణేషీ లాల్, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పలువురు ఇతర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 

దివంగత ప్రొఫెసర్‌ నేపథ్యం 
నయాగడ్‌లో 1943వ సంవత్సరం జనవరి నెల 30వ తేదీన జన్మించిన ఆయన  అర్థశాస్త్రం ఆనర్స్‌తో డిగ్రీ ఉత్తీర్ణులై 1965వ సంవత్సరంలో స్థానిక ఉత్కళ విశ్వ విద్యాలయం నుంచి అప్‌లైడ్‌ ఎకనమిక్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకుడిగా పని చేశారు. 2001వ సంవత్సరంలో పూరీ ఎస్‌సీఎస్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ హోదాలో విరామం పొందారు. 

కీలక బాధ్యతలు
రాష్ట్ర సైన్స్, టెక్నాలజీ, పర్యావరణం, విద్య, యువజన సేవలు, గ్రామీణ అభివృద్ధి శాఖల్లో కీలక పదవుల్లో ఆయన విజయవంతంగా బాధ్యతలు   నిర్వహించారు. అలాగే రాష్ట్ర ప్రణాళిక బోర్డు, రాష్ట్ర వాటర్‌ షెడ్‌ మిషన్‌ సలహా కమిటీ, విద్య టాస్క్‌ఫోర్స్, వన్య ప్రాణుల సలహా కమిటీ, ఎన్‌ఎస్‌ఎస్‌ సలహా కమిటీ, సంయుక్త అటవీ నిర్వహణ స్టీరింగ్‌ కమిటీ, భారత ప్రభుత్వ ఎన్‌ఎస్‌ఎస్‌ ఎవాల్యూషన్‌ కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్‌గా ప్రతిష్టాత్మక హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ప్రజాసేవకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రతిష్టాత్మక ఉత్కళ సేవా సమ్మాన్‌ పౌరసత్కార పురస్కారం ప్రదానం చేసింది. 

కుమార్తెతో కలిసి పద్మశ్రీ
వ్యవసాయ రంగంలో ఆయన చేసిన విశిష్ట సేవలకు కేంద్రప్రభుత్వం గత ఏడాది ఆయనతో పాటు కుమార్తె సబరమతికి ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. ఆహార అరణ్యం ఆవిష్కర్తలుగా తండ్రీకూతుళ్లు విశేష గుర్తింపు పొందారు. సంభవ్‌ సంస్థ ఆధ్వర్యంలో ఔత్సాహిక వ్యక్తులు, రైతులకు సేంద్రియ సాగులో మెలకువలు తెలియజేసి వ్యవసాయ రంగంలో కొత్త మలుపులు ఆవిష్కరించిన తండ్రీకూతుళ్లను పద్మశ్రీ పురస్కారం వరించింది.  

గ్లోబల్‌ రోల్‌ ఆఫ్‌ ఆనర్‌ 
ఆర్థికవేత్త పర్యావరణవేత్తగా మారి సేంద్రియ సాగులో విభిన్న రీతుల ఆవిష్కరణలో కీలక పాత్రధారిగా ఆయన గుర్తింపు సాధించారు.  పర్యావరణ రంగంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా ఐక్య రాజ్య పర్యావరణ కార్యక్రమం యూఎన్‌ఈపీ కింద గ్లోబల్‌ రోల్‌ ఆఫ్‌ ఆనర్‌ ఆయనకు ప్రదానం చేయడం విశేషం. ఆయన ఆవిష్కరించిన సంభవ్‌ సంస్థ సేంద్రియ సాగులో దేశ వ్యాప్తంగా రైతాంగానికి రిసోర్స్‌ సెంటర్‌గా వెలుగొందుతోంది.

>
మరిన్ని వార్తలు