భారత గడ్డపై దాడికి పాక్‌ ఆర్మీ కుటిల యత్నం.. ‘సుపారీ’ ఉగ్రవాది పట్టివేతతో..

25 Aug, 2022 07:33 IST|Sakshi

శ్రీనగర్‌: భారత గడ్డపై దాడులకు పాక్‌ సైన్యం కుటిల యత్నాలు చేస్తోంది. అయితే ఈ ప్రయత్నాలను భారత్‌ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో.. భారత్‌లో దాడులకు సుపారీ తీసుకున్న ఓ ఉగ్రవాదిని భారత సైన్యం నిలువరించగలిగింది.

జమ్ము కశ్మీర్‌ రాజౌరి వద్ద గత రెండురోజులుగా భారత్‌లోకి చొరబడేందుకు పాక్‌ ఉగ్రవాదులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. పీవోకే సమీపంలోని అటవీ ప్రాంతంలో భారత సైన్యం అమర్చిన ల్యాండ్‌ మైన్‌ పేలి ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా..  ఆగస్టు 21న నౌషేరా ప్రాంతంలోని ఝంగర్ సెక్టార్‌ నుంచి భారత్‌లోకి ఆయుధాలతో అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఓ ఉగ్రవాదిని గాయపరిచి అదుపులోకి తీసుకుంది భారత సైన్యం.

సరిహద్దు ప్రాంతంలోని ఫెన్సింగ్‌ను కట్‌ చేసి చొరబడేందుకు ప్రయత్నించారు. గమనించిన భారత సైనికులు కాల్పులు జరిపి.. అతన్ని గాయపరిచి పట్టుకున్నారు. గాయపడిన ఉగ్రవాదికి చికిత్స అందించి ప్రాణాలు కాపాడడమే కాకుండా.. అతని నుంచి కీలక సమాచారం సేకరించింది భారత సైన్యం. అతన్ని పీవోకే కొట్లి జిల్లా సబ్జ్‌కోట్‌కు చెందిన తబరాక్‌ హుస్సేన్‌గా గుర్తించింది. పాక్‌ ఇంటెలిజెన్సీ ఏజెన్సీకి చెందిన కల్నల్‌ యూనస్‌ చౌద్రీ తనను పంపించాడని, భారత ఆర్మీపై దాడులకు పాల్పడాలంటూ తనకు రూ.30వేల పాక్‌ రూపాయలను ఇచ్చాడని వెల్లడించాడు. ఆయుధాలతో పాటు పాక్‌ కరెన్సీని భారత ఆర్మీ స్వాధీనం చేసుకుంది. 

విశేషం ఏంటంటే.. 2016లో తబరాక్‌ నియంత్రణ రేఖ వెంబడి తన సోదరుడితో సహా చొరబడేందుక యత్నించగా.. ఇండియన్‌ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. అయితే మానవతా ధృక్పదంతో ఏడాది జైలుశిక్ష తర్వాత అతన్ని మళ్లీ వెనక్కి పంపించేసింది. అయినప్పటికీ తీరు మార్చుకోకుండా ఈసారి ఏకంగా దాడులకే సిద్ధపడడం గమనార్హం.

ఇదీ చదవండి: మరో జలియన్‌ వాలాబాగ్‌.. 80 ఏళ్లు పూర్తి.. అయినా గుండెలపై మానని గాయం

మరిన్ని వార్తలు