డ్రోన్ దాడి పాక్‌ పనే: జమ్ము కశ్మీర్ డీజిపీ

29 Jun, 2021 20:35 IST|Sakshi

జమ్మూ: జమ్మూలోని భారత వైమానిక దళం స్థావరంపై సంచలనాత్మక డ్రోన్ దాడి వెనుక నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఈ దాడికి కారణమని అనుమానిస్తున్నట్లు జమ్ము కాశ్మీర్ డిజిపి దిల్‌బాగ్ సింగ్  తెలిపారు. పాక్‌ సరిహద్దు ఆవల నుంచే ఆ డ్రోన్లు వచ్చాయని భావిస్తున్నట్లు వెల్లడించారు. వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు ఆదివారం డ్రోన్లతో దాడులు జరపగా ఇద్దరు జవాన్లు గాయపడిన సంగతి తెలిసిందే. 

డ్రోన్​ కాక్​టైల్ భాగంలో ఆర్డీఎక్స్​ను పేలుడుకు ఉపయోగించినట్లు అధికారులు అంచనాకొచ్చారు. భారత వైమానిక దళం స్థావరం వద్ద ప్రస్తుత పరిస్థితిని ఐపిఎస్ అధికారి సింగ్ పర్యవేక్షిస్తున్నాడని ఆయన అన్నారు. జమ్మూలో అనుమానాస్పద ప్రాంతాల్లో పోలీసులు వరుసగా సోదాలు జరుపుతున్నారు. జమ్మూ కాశ్మీర్‌లో అనధికారికంగా డ్రోన్‌లను ఉపయోగించవద్దని ప్రజలకు హెచ్చరిక కూడా జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఇక ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కు అప్పగిస్తూ కేంద్ర హోం శాఖ మంగళవారం నిర్ణయం తీసుకుంది.

మరో ఉగ్రకుట్ర భగ్నం
జమ్మూకశ్మీర్‌లో డ్రోన్ల సాయంతో ప్రయత్నించిన మరో ఉగ్రకుట్రను భద్రతా సిబ్బంది భగ్నం చేశారు. భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) స్థావరంపై డ్రోన్ల దాడి జరిగిన కొన్ని గంటల్లోనే అదే తరహా ఘటన పునరావృతమవడం సంచలనం రేపింది. ఈసారి సైనిక స్థావరాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నారు. డ్రోన్లతో దాడికి ప్రయత్నించారు. ఆర్మీ జవాన్లు అప్రమత్తమై ఎదురుదాడికి దిగడంతో డ్రోన్లు తోకముడిచాయి. జమ్మూకశ్మీర్‌లోని రత్నుచక్‌–కలుచక్‌ సైనిక స్థావరం వద్ద ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు సోమవారం ప్రకటించారు.

ఆదివారం అర్ధరాత్రి 11.45 గంటలకు ఒక డ్రోన్, సోమవారం తెల్లవారుజామున 2.40 గంటలకు మరో డ్రోన్‌ సైనిక స్థావరం వైపు దూసుకొచ్చాయని తెలిపారు. వాటిని నేలకూల్చడానికి విధుల్లో ఉన్న సెంట్రీలు దాదాపు రెండు డజన్ల రౌండ్లు కాల్పులు జరపడంతో డ్రోన్లు వెనక్కి వెళ్లిపోయాయని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఆర్మీ పీఆర్‌ఓ లెఫ్టినెంట్‌ కల్నల్‌ దేవేందర్‌ ఆనంద్‌ వివరించారు.
చదవండి: మొబైల్‌ సిగ్నల్‌ కోసం చెట్టెక్కిన పిల్లలు.. అంతలోనే ఒక్కసారిగా

మరిన్ని వార్తలు