కశ్మీర్‌ విధ్వంసానికి పాక్‌ పన్నాగం

20 Oct, 2020 10:48 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : ఉగ్రవాదులపై పోరులో ముందున్న భారత్‌పై కక్ష తీర్చుకోవాలనుకుంటున్న దాయాది దేశం పాకిస్తాన్‌ ప్రయత్నాలు ఏమాత్రం మానటంలేదు. దేశంలో ఉగ్ర చర్యలకు పాల్పడాలని, ఉగ్రవాదులను ఉసిగొల్పి విధ్వంసం సృష్టించాలని ప్రణాళిలు రచిస్తూనే ఉంది. ఏ ఒక్క అవకాశం వచ్చినా.. భారత్‌ను దొంగ దెబ్బ తీయాలని కలలు కంటోంది. సరిహద్దుల్లో కశ్మీర్‌ను వేదికగా చేసుకుని రక్తపాతం సృష్టించాలని కుట్రలకు పన్నుతోంది. అయితే భారత్‌కు చెందిన నిఘా వర్గాల అప్రమత్తతో ఎన్నోసార్లు పాక్‌ ఎత్తులు చిత్తు అయ్యాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం కశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేలా పాకిస్తాన్‌ ఆర్మీ ఉగ్రవాద సంస్థలతో మంతనాలు జరిపినట్లు తేలింది. కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్‌ ఇంటిలిజెన్స్‌ అధికారి ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలను వెల్లడించారు. (లద్దాఖ్, కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం)

ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. పాక్‌ ఆర్మీ నేతృత్వంలోని అధికారుల బృంధం కశ్మీర్‌లో ఉగ్రదాడికి పాల్పడాలని ప్రణాళిక రచించింది. ఆర్టికల్‌ 370 రద్దు, కశ్మీర్‌ విభజనపై నిరసనగా భారత ప్రభుత్వంపై కుట్ర పన్నాలని వ్యూహరచన చేసింది. దీనిలో భాగంగా ఆ దేశంలో తలదాచుకుంటున్న జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రసంస్థలకు చెందిన ప్రతినిధులతో చర్చలు జరిపింది. ఈ మేరకు 2019 డిసెంబర్‌ 27న తొలి భేటీ, ఈ ఏడాది జనవరి తొలి వారంలో ఇస్లామాబాద్‌ వేదికగా రెండో భేటీ నిర్వహించారు. కశ్మీర్‌లో జాయింట్‌ ఆపరేషన్‌ ద్వారా విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా ఈ రెండు సమావేశాల్లో తీర్మానం చేశారు. ఇదంతా పాక్‌ ఆర్మీకి చెందిన కీలక అధికారుల సమక్షంలోనే జరింది. అయితే అప్పటికే పాకిస్తాన్‌ కుట్రలను పసిగట్టిన భారత నిఘా వర్గాలు ఆర్మీ సహకారంతో వారి చర్యను భగ్నం చేశారు. భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించి ఎప్పటికప్పుడు చాకచాక్యంగా వహరించారు. దీంతో కశ్మీర్‌కు పాక్‌ నుంచి పొంచిఉన్న పెను ముప్పు తప్పిందని ఇంటిలిజెన్స్‌ అధికారి వెల్లడించారు.

కాగా కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ గత ఏడాది ఆగస్ట్‌లో ఆర్టికల్‌ 370ని  రద్దు చేసి కశ్మీర్‌ను రెండుగా విభజించిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని పాకిస్తాన్‌లోని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం బహిరంగంగానే తప్పుబట్టింది. కశ్మీరీలను హక్కులను హరించడానికి కేం‍ద్రం ఈ నిర్ణయం తీసుకుందని భారత్‌పై విషం కక్కింది. కశ్మీరీలకు అండగా తాము ఉంటామని ఇమ్రాన్‌ ప్రకటించారు. ఆయన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం సైతం గట్టిగానే బదులిచ్చింది. కశ్మీర్‌ భారత్‌లోని అంతర్భాగమని, తమ నిర్ణయాల్లో తలదూర్చొద్దని హెచ్చరించింది. అయితే పాక్‌ బుద్ధిని ముందే ఊహించిన కేంద్రం.. ఆర్మీ సహాయంతో కశ్మీర్‌లో ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలో తలెత్తకుండా కఠిన చర్యలను చేపట్టింది. కీలక నేతలందరినీ గృహ నిర్బంధం చేసి పరిస్థితులను చక్కదిద్దింది. లోయలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు 144 సెక్షన్‌ విధించి అప్రమత్తంగా వ్యవహరించింది. 
 

మరిన్ని వార్తలు