బుద్ధిమారని పాక్.. టర్కీకి వెళ్లే భారత యుద్ధ విమానాలకు అనుమతి నిరాకరణ..!

7 Feb, 2023 19:48 IST|Sakshi

న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధి చాటుకుంది. భూకంపంతో విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న టర్కీకి సాయం అందించేందుకు వెళ్తున్న భారత యుద్ధ విమానాలు తమ గగనతలం మీద నుంచి వెళ్లకుండా అడ్డుకుంది. దీంతో భారత సీ-17 యుద్ధ విమానం వెనక్కి వచ్చి వేరే దేశం మీదుగా టర్కీకి చేరుకోవాల్సి వచ్చింది. ఈమేరకు భారత మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

అయితే భారత యుద్ధవిమానాలు అసలు పాకిస్తాన్ గగనతలం మీదుగా వెళ్లలేదని, ఇందుకు సంబంధించి ఎలాంటి అనుమతులు కూడా పాకిస్తాన్‌ను భారత్‌ అడగలేదని అధికారిక వర్గాలు తెలిపాయి.

భారత్‌లోని టర్కీ రాయబారి ఫిరత్ సునెల్ కూడా ఈ విషయంపై స్పందించారు. భారత యుద్ధవిమానాలు ఎగిరేందుకు పాకిస్తాన్ అనుమతి నిరాకరించిందనే విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు.

2021లో కూడా అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నప్పుడు భారతీయులను ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తీసుకొచ్చింది కేంద్రం. అప్పుడు కూడా మనం పాక్ గగనతలాన్ని వినియోగించుకోలేదు. మన విమానాలు అఫ్గాన్ నుంచి ఇరాన్ మీదుగా భారత్ చేరుకున్నాయి.

రెండు యుద్ధవిమానాలు..
భూకంపం అనంతరం టర్కీకి భారత్ తనవంతు సాయం చేస్తోంది. ఇప్పటివరకు రెండు యుద్ధ విమానాల్లో సహాయక సిబ్బంది, పరికరాలు, ఔషధాలను పంపింది.  మొదటి యుద్ధ విమానం సోమవారం రాత్రే టర్కీ చేరుకోగా.. రెండో యుద్ధ విమానం మంగళవారం వేకువజామున టర్కీకి వెళ్లింది.  ఈ విమానాల్లో జాతీయ విపత్తు నిర్వహణ దళాలు, ప్రత్యేక శిక్షణ తీసుకున్న డాగ్ స్క్వాడ్లు, డ్రిల్లింగ్ మెషీన్లు, ఔషధాలు, పరికరాలు సహా ఇతర సామగ్రిని భారత్ టర్కీకి పంపింది.

చదవండి: భూకంపం తర్వాత టర్కీలో పరిస్థితి ఇదీ..! డ్రోన్ వీడియో వైరల్..

మరిన్ని వార్తలు