Pakistan ISI: రైల్వే ట్రాక్‌లను పేల్చేసేందుకు ఐఎస్‌ఐ కుట్ర

23 May, 2022 16:05 IST|Sakshi

కేంద్ర నిఘా వర్గాల సమాచారం

పంజాబ్‌, పరిసర రాష్ట్రాలే టార్గెట్‌

న్యూఢిల్లీ: మనదేశంలో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) ప్రయత్నిస్తోందని కేంద్ర నిఘా వర్గాలు వెల్లడించాయి. పంజాబ్, దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లోని రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులకు ఐఎస్‌ఐ పెద్ద కుట్ర పన్నిందని తెలిపాయి. ఈ మేరకు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చరిక జారీ చేశాయి.

గూడ్స్‌ రైళ్లే టార్గెట్‌
సరకు రవాణా రైళ్లను ధ్వంసం చేయడానికి పంజాబ్‌తోపాటు పరిసర రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్‌లను పేల్చివేయాలని ఐఎస్‌ఐ ప్లాన్‌ చేసిందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకోసం భారతదేశంలోని తన కార్యకర్తలకు ఐఎస్‌ఐ పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తోందని వెల్లడించాయి. భారత్‌లో ఉన్న పాక్‌ స్లీపర్‌ సెల్స్‌కు తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తోందని వివరించాయి.


ఖలిస్తాన్‌ ఉగ్రవాదుల ఎగదోత

ఖలిస్తాన్‌ ఉగ్రవాదులను కూడా దాడులకు ఐఎస్‌ఐ ఉసిగొల్పుతోందని నిఘా వర్గాలు సమాచారం అందించాయి. లాహోర్‌లో దాక్కున్న ఖలిస్తాన్‌ ఉగ్రవాది హర్విందర్ సింగ్ రిండాను ఇందుకోసం వాడుకుంటోందని వెల్లడైంది. పంజాబ్‌లో శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగించేందుకు భారత వ్యతిరేక శక్తులు పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నట్టు నిఘా సంస్థలు సేకరించిన ఆధారాలు రుజువు చేస్తున్నాయి.


భద్రత కట్టుదిట్టం

నిఘా వర్గాల సమాచారంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. రైల్వే ట్రాకుల వెంట భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు గస్తీని ముమ్మరం చేశాయి. పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోని రైలు మార్గాల్లో నిఘా పెంచారు. (క్లిక్‌: నాన్నా! భయమేస్తోంది.. వచ్చేయాలనుంది)


పంజాబ్‌పై గురి

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆటలు సాగకపోవడంతో పంజాబ్‌పై గురిపెట్టారని ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ‘జమ్మూకశ్మీర్‌లో ఐఎస్‌ఐ విజయం సాధించలేకపోవడంతో సరిహద్దు రాష్ట్రంలో మిలిటెన్సీని పునరుద్ధరించడానికి పంజాబ్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఇందుకోసం సిక్కు తీవ్రవాద సంస్థలైన సిక్కు ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే) బబ్బర్ ఖల్సా కూడా పనిచేస్తున్నాయి. కుట్రలో భాగంగా పంజాబ్‌లోని యువతను పెడదోవ పట్టించి సాయుధ దాడులు చేసేలా ఉసిగొల్పేందుకు ప్రయత్నిస్తున్నాయ’ని వివరించారు. ఖలిస్తాన్‌ ఉగ్రవాదులు తమ నెట్‌వర్క్‌ను ఇతర రాష్ట్రాలకు విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోందన్నారు. ఇటీవల హరియాణలోని కర్నాల్ జిల్లాలో నలుగురు సిక్కు తీవ్రవాదులను అరెస్టు చేయడంతో ఈ విషయం వెల్లడైందన్నారు. (క్లిక్‌: దేశంలో ఒమిక్రాన్‌ సబ్‌వేరియెంట్‌ కేసుల కలకలం)

మరిన్ని వార్తలు