ఎఫ్‌ఏటీఎఫ్‌ ‘గ్రే లిస్ట్‌’లోనే పాక్‌

24 Oct, 2020 05:39 IST|Sakshi

న్యూఢిల్లీ: వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు ఎఫ్‌ఏటీఎఫ్‌(ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌)కు సంబంధించి గ్రే లిస్ట్‌లోనే పాక్‌ కొనసాగనుంది. ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం, నగదు అక్రమ రవాణా నివారణలకు ఆయా దేశాలు తీసుకున్న చర్యల ఆధారంగా ఈ జాబితాలో చోటు కల్పిస్తారు. గతంలో అంగీకరించిన 6 కీలక షరతుల అమలు విషయంలో పాకిస్తాన్‌ విఫలం కావడంతో గ్రే జాబితాలోనే ఆ దేశం కొనసాగే పరిస్థితి నెలకొన్నది.

అంతర్జాతీయ ఉగ్రవాదులు మౌలానా మసూద్‌ అజర్‌(జైషే మొహమ్మద్‌ ఉగ్ర సంస్థ చీఫ్‌), హఫీజ్‌ సయీద్‌(లష్కరే తోయిబా ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు), జకీఉర్‌ రహమాన్‌ లఖ్వీ(లష్కరే తోయిబా ఆపరేషనల్‌ కమాండర్‌)లపై చర్యలు తీసుకోవడం ఆ ఆరు కీలక షరతుల్లో ఒకటి. ఎఫ్‌ఏటీఎఫ్‌ ప్లీనరీ బుధ, గురు, శుక్రవారాల్లో వర్చువల్‌ విధానంలో జరిగింది. ‘సునిశిత పర్యవేక్షణ అవసరమైన జాబితా(గ్రే లిస్ట్‌)లోనే పాకిస్తాన్‌ను కొనసాగించాలని నిర్ణయించాం’ అని ఎఫ్‌ఏటీఎఫ్‌ అధ్యక్షుడు మార్కస్‌ ప్లీయర్‌ వెల్లడించారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి ఆర్థిక సాయం అందే విషయంలో ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రే లిస్ట్‌లో ఉన్న దేశాలపై అనేక ఆంక్షలుంటాయి.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు