మోదీకి రాఖీ పంపిన పాకిస్తాన్‌ మహిళ!

31 Jul, 2020 08:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మరికొన్ని రోజుల్లో రక్షబంధన్‌ రాబోతుంది. ప్రతి సోదరి తమ సోదరులకు రాఖీ కట్టడానికి అన్ని సిద్ధం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే  గత 25 ఏళ్లుగా క్రమం తప్పకుండా ప్రధాని నరేంద్ర మోదీకి రాఖీ పంపుతున్న పాకిస్తాన్‌ సోదరి కమర్ మొహిసిన్ షేక్ ఈసారి కూడా రాఖీ పంపారు.  మోదీ ఆయురారోగ్యాలతో వందేళ్లు జీవించాలని ప్రార్థిస్తూ ఈ రాఖీ పంపినట్టు కమర్‌ తెలిపారు. మోదీని తనతోపాటు తన భర్త మొహిసిన్‌, కుమారుడు సుఫీయాన్‌ కూడా అభిమానిస్తారని ఈ సందర్భంగా కమర్ పేర్కొన్నారు. గత 25 ఏళ్ల నుంచి మోదీకి రాఖీ కడుతున్నానని అప్పుడు మోదీ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త అని తెలిపారు. తన పట్టుదల, శ్రమతో మోదీ ప్రధానమంత్రి వరకు ఎదిగారని ప్రశంసించారు.  

 మోదీ నుంచి పిలుపు వస్తే తాను తప్పకుండా ఢిల్లీ వెళ్తానని కమర్‌ చెప్పుకొచ్చారు. చాలా సార్లు మోదీ, కమర్‌కు ఫోన్‌ చేసి రాఖీ కట్టించుకోవడానికి పిలిచారు. కమర్‌ భర్త, కొడుకు గురించి అడిగి తెలుసుకునే వారు.  మోదీ చాలా సాధారణంగా కనిపించినా పనులు మాత్రం గొప్పగా చేస్తారని కమర్‌ కొనియాడారు.  తన ఇద్దరు చెల్లెళ్లు కూడా మోదీకి రాఖీ కట్టాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. పాకిస్తాన్‌కు చెందిన కమర్‌ మొహిసిన్‌ భారత్‌కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. ప్రస్తుతం వారు అహ్మదాబాద్‌లో ఉంటున్నారు. రాఖీ కట్టినందుకు ప్రధాని నుంచి ఏం కోరుకుంటున్నారు అని అడగ్గా ఆయన ఆశీర్వదం మాత్రం చాలని, తన ప్రతి విజయం వెనుక మోదీ ఉన్నారని పేర్కొన్నారు. 

చదవండి: దైవ దూష‌ణ‌: కోర్టులో ముస్లిం హ‌త్య

మరిన్ని వార్తలు