ప్లాన్‌ మార్చిన పళణి స్వామి.. జంబో జట్టుతో వ్యూహరచన!

27 Jan, 2023 07:06 IST|Sakshi

సెంగోట్టయన్‌ నేతృత్వంలో 106 మంది ఎంపిక 

గెలుపే లక్ష్యంగా పోరాడాలని పిలుపు  

సాక్షి, చెన్నై: ఈరోడ్‌ తూర్పు నియోజకవర్గంలో గెలుపు బావుటా ఎగురవేడయమే లక్ష్యంగా అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి వ్యూహాలకు పదును పెట్టారు. ఎమ్మెల్యే కేఏ సెంగోట్టయన్‌ నేతృత్వంలో జంబో జట్టును గురువారం రంగంలోకి దించారు. ఇందులో పార్టీ మాజీ మంత్రులు, ముఖ్య నేతలు 106 మంది ఉన్నారు. 

వివరాల ప్రకారం.. ఈరోడ్‌ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే కాంగ్రెస్‌ అభ్యర్థి ఈవీకేఎస్‌ ఇలంగోవన్‌ ప్రచారంలో ఉరకలు తీస్తున్నారు. ఆయనకు మద్దతుగా డీఎంకే మంత్రులు 11 మందితో పాటుగా ముఖ్య నేతలు 31 మంది ఓట్ల వేటలో ఉన్నారు. వీరంతా ఒక్కో ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని అక్కడి ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నం అయ్యారు. అదే సమయంలో తానేమి తక్కువ కాదని చాటే విధంగా తన సొంత జిల్లా సేలంకు పొరుగున ఉన్న ఈరోడ్‌ తూర్పు స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి వ్యూహాలకు పదును పెట్టారు.

పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్‌ పన్నీరు సెల్వం శిబిరం రూపంలో ఏదేని చిక్కులు , సమస్యలు ఎదురైనా తిప్పికొట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈరోడ్‌ తూర్పులో గెలుపే లక్ష్యంగా ఎన్నికల కోసం జంబో జట్టును రంగంలోకి దించారు. ఎమ్మెల్యే కేఏ సెంగోట్టయన్‌ నేతృత్వంలోని ఈ జట్టులో పార్టీ ప్రిసీడియం చైర్మన్, మాజీమంత్రులు, ముఖ్య నేతలు 106 మంది ఉన్నారు. వీరందరితో గురువారం ఈరోడ్‌లో పళణి స్వామి భేటీ అయ్యారు.  

ఢిల్లీ పెద్దలే కారణం.. 
అన్నాడీఎంకేలో నెలకొన్న పరిస్థితులకు ఢిల్లీ పెద్దలే కారణం అని అమ్మమక్కల్‌ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శక్తివంతమైన పార్టీని చిన్నాభిన్నం చేయడంలో ఢిల్లీ పాత్రే ఎక్కువగా ఉందని గురువారం ఓ మీడియాతో మాట్లాడుతూ ధ్వజమెత్తారు. ఇక ఉప ఎన్నికల విషయంపై పన్నీరుసెల్వం మంతనాలు కొనసాగిస్తూనే ఉన్నారు. మిత్రులను కలిసి మద్దతు వేటలో ఉన్న ఆయన శిబిరం నేతలు ఇప్పటి వరకు తూర్పు నియోజకవర్గం వైపుగా వెళ్లక పోవడం గమనార్హం. 

ఇదిలా ఉండగా ఈవీకేఎస్‌కు మద్దతు ప్రకటించిన మక్కల్‌ నీది మయ్యం నేత కమలహాసన్, స్వయంగా ప్రచారానికి వెళ్లాలని నిర్ణయించారు. ఆ నియోజకవర్గంలో నాలుగైదు రోజుల పాటు పర్యటించేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నా రు. ఇక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు. అలాగే ఎన్నికల విధుల్లోకి రానున్న 550 మంది టీచర్ల జాబితాను సిద్ధం చేసి ప్రకటించారు.  

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గేకు షాకిచ్చిన సీఎం నితీశ్‌ కుమార్‌

మరిన్ని వార్తలు