Tamil Nadu: సుప్రీంకోర్టుకు పళనిస్వామి.. తీర్పుపై ఫుల్‌ ఉత్కంఠ

29 Jul, 2022 07:32 IST|Sakshi

సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం వ్యవహారంలో తమ వాదన వినాలని కోరుతూ ఎడపాడి కె.పళనిస్వామి తరఫున కేవియేట్‌ పిటిషన్‌ గురువారం సుప్రీంకోర్టులో దాఖలైంది. అన్నాడీఎంకేలో పన్నీరు సెల్వం, పళని స్వామి శిబిరాల మధ్య జరుగుతున్న వార్‌ గురించి తెలిసిందే.

ఈ పరిస్థితుల్లో ఈనెల 11వ తేదీ చెన్నైలో పళనిస్వామి నేతృత్వంలో జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశాన్ని పన్నీరు సెల్వం తీవ్రంగా వ్యతిరేకించారు. అదే సమయంలో ఈ సమావేశం వేదికగా అన్నాడీఎంకే సమన్వయ కమిటీని రద్దు చేశారు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి ఎంపికయ్యారు. అలాగే అన్నాడీఎంకే నుంచి పన్నీరు సెల్వం అండ్‌ బృందాన్ని సాగనంపే విధంగా తీర్మానాలు చేశారు. దీంతో ఈ సమావేశానికి, ఇందులో తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా పన్నీరుసెల్వం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

అలాగే ఈ సమావేశం నిర్వహణకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పళని స్వామి తరఫున కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీమంత్రి ఎస్పీ వేలుమణి గురువారం సుప్రీంకోర్టులో కేవియేట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పన్నీరు సెల్వం దాఖలు చేసిన పిటిషన్‌ వ్యవహారంలో తమ వాదన వినాలని కోరారు. అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశానికి ఉన్న ప్రాధాన్యత, అధికారాల గురించి ఆ పిటిషన్‌లో వివరించారు.  

ఇది కూడా చదవండిఐదేళ్లలో కేంద్రం ప్రకటనల ఖర్చు రూ.3,339 కోట్లు

మరిన్ని వార్తలు