Edappadi K Palaniswami: హస్తినలో పళనిస్వామికి చేదు అనుభవం.. ఇలా జరిగిందేంటి?

25 Jul, 2022 07:47 IST|Sakshi

సాక్షి, చెన్నై: ఢిల్లీ వెళ్లిన అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామికి ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్‌ దక్కనట్లు తెలుస్తోంది. దీంతో ఆదివారం ఆయన చెన్నైకు తిరిగి వచ్చేశారు. ఈ పరిస్థితుల్లో పన్నీరు సెల్వం ఓ అడుగు ముందుకు వేసి, 14 జిల్లాలకు అన్నాడీఎంకే కార్యదర్శులను నియమిస్తూ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. 

అన్నాడీఎంకేలో పళనిస్వామి, పన్నీరు సెల్వం మధ్య సాగుతున్న వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  ఈ ఇద్దరు నేతలు ఎత్తుకు పైఎత్తు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకర్ని మరొకరు అన్నాడీఎంకే నుంచి తొలగిస్తూ.. ఇప్పటికే పలు ప్రకటనలు విడుదల చేశారు.ఈ పరిస్థితుల్లో పళనిస్వామికి ఢిల్లీ నుంచి ఆహా్వనం రావడంతో ఇక, పన్నీరు సెల్వంకు కేంద్రం అండదండాలు కరువైనట్లే అన్న చర్చజోరందుకుంది.  

తిరుగు పయనం 
రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్మును పళనిస్వామి బృందం శనివారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసింది. అలాగే రామ్‌నాథ్‌ కోవింద్‌ వీడ్కోలు కార్యక్రమానికి కూడా పళని స్వామి హాజరయ్యారు. ఇక ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కలిసేందుకు పళని స్వామి బృందం ప్రయత్నాలు చేసింది. అయితే, అపాయింట్‌మెంట్‌ లభించకపోవడంతో వారంతా తిరిగి చెన్నైకు వచ్చేశారు. అదే సమయంలో పళని స్వామి వ్యవహరించిన తీరుపై కేంద్రం గుర్రుగా ఉన్నట్టు, అందుకే ఆయనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వనట్లు పన్నీరు సెల్వం శిబిరం చెబుతుండడం గమనార్హం. ఇక ఈనెల 28వ తేదీ చెస్‌ ఒలంపియాడ్‌ నిమ్తితం చెన్నైకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ అన్నాడీఎంకేలో విభేదాలకు ముగింపు పలికే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇద్దరూ ఒకేసారిగా తనను కలవాలనే ఆదేశాలు ఢిల్లీ నుంచి పన్నీరు, పళనికి వేర్వేరుగా వచ్చినట్లు సమాచారం. 

కొత్త కార్యదర్శులను నియమించిన పన్నీరు 
తన మద్దతుదారులు 14 మందిని అన్నాడీఎంకే కార్యదర్శులుగా నియమిస్తూ పన్నీరు సెల్వం ఆదివారం ప్రకటన చేశారు. చెన్నై పరిధిలోని నాలుగు జిల్లాలకు, కోయంబత్తూరు, రామనాథపురం తదితర జిల్లాలకు కార్యదర్శులను నియమించారు. ఇందులో ఎంపీ ధర్మర్‌ను రామనాథపురం జిల్లా కార్యదర్శి, కోవై సెల్వరాజ్‌ను కోవై నగర కార్యదర్శిగా నియమించారు. ఇదిలా ఉండగా పన్నీరు సెల్వంపై పళని వర్గం నేత, ఎంపీ సీవీ షన్ముగం ఇచ్చిన ఫిర్యాదుపై చెన్నై పోలీసులు కేసు నమోదుకు సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే కార్యాలయంలో వస్తువులు మాయమైనట్లుగా సీవీ షన్ముగం ఇచ్చిన ఫిర్యాదుపై న్యాయ నిపుణులతో ఆదివారం చెన్నై పోలీసులు చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది.   

ఇది కూడా చదవండి: కూతురిపై ఆరోపణలు.. కాంగ్రెస్ నేతలకు స్మృతి ఇరానీ లీగల్ నోటీసులు

మరిన్ని వార్తలు