నీ భార్యతో కలిసుంటే నువ్వు ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేవు.. చివరికి!

13 Jul, 2021 10:09 IST|Sakshi

ముంబై: జాతకాలు, జ్యోతిష్యం వంటి వాటిని భారతీయులు గట్టిగా విశ్వసిస్తారు. రాశిఫలాలు, గ్రహాలు అంటూ పూజారి చెప్పిన విషాయాలన్నింటిని పాటిస్తారు. తాము జీవితంలో ఉన్నతంగా స్థిరపడేందుకు, అనుకున్నది సాధించేందుకు ఏం చేయడానికైనా వెనుకాడరు. ఇందులో కొన్ని మంచి చేసే పనులు ఉంటే చాలా వరకు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా జ్యోతిష్కుడు చెప్పిన మాటలను నమ్మి కట్టుకున్న భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఓ ప్రబుద్ధుడు ఈ ఘటన మహారాష్ట్రలో సోమవారం వెలుగు చూసింది.

పుణెకు చెందిన రఘునాథ్‌ ఏముల్‌ తను ఎమ్మెల్యే లేదా మంత్రి కావాలంటే ఏం చేయాలని జ్యోతిష్కుడిని (హస్తరేఖలు చూసి జాతకం చెప్పే వ్యక్తి) అడిగాడు. దీనికి అతను ఇంట్లో తన భార్య ఉండగా నువ్వు ఎప్పటికీ నీ కలను సాధించలేవని, ఆమె మంచిది కాదని నిందలు వేశాడు. తనకు విడాకులు ఇస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుందని సలహా ఇచ్చాడు.

ఇది నమ్మిన రఘునాథ్‌, అప్పటి నుంచి తన తల్లిదండ్రులతో కలిసి భార్యను వేధింపులకు గురిచేయడం ప్రారంభించారు. దీంతో విసిగి పోయిన భార్య తనను వరకట్న వేధింపులకు గురిచేస్తున్నారని మహిళ ఆమె భర్త, అత్తామామలపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. మహిళా ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు