కన్నడనాట రిజర్వేషన్ల యుద్ధం

22 Feb, 2021 04:34 IST|Sakshi
బెంగళూరులో ఆదివారం జరిగిన పంచమసాలి లింగాయత్‌ల సభకు భారీగా హాజరైన ప్రజలు

ఆందోళన బాటలో పలువర్గాలు 

పంచమసాలిల భారీ సభ 

బుజ్జగింపు యత్నాల్లో సీఎం యెడ్డీ

బనశంకరి: రిజర్వేషన్లను పెంచాలని వాల్మీకులు, ఎస్టీల్లో చేర్చాలని కురుబలు, తమనూ బీసీలుగా గుర్తించాలని అగ్రవర్ణ వీరశైవ, లింగాయత్‌ల ఆందోళనలు కర్ణాటకలో ఊపందుకున్నాయి. నెలరోజుల నుంచి ఎవరికి వారు ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తూ యెడియూరప్ప సర్కారుపై ఒత్తిడి పెంచుతున్నారు. ఆఖరికి మంత్రులు సైతం తమ వర్గాల సమావేశాల్లో పాల్గొంటూ గళమెత్తడంతో సీఎం యెడియూరప్పకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి.  

గుణపాఠం తప్పదన్న పంచమసాలిలు ..
ఈ నేపథ్యంలో బెంగళూరు ప్యాలెస్‌ మైదానంలో ఆదివారం లింగాయత పంచమసాలి వర్గీయులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ వర్గీయులు అధికంగా ఉండే కలబురిగి, విజయపుర, బాగల్‌కోటే, యాదగిరి, బీదర్, రాయచూరు, కొప్పళ, బళ్లారి, హావేరి, ధారవాడ, బెళగావిల నుంచి వేలాదిగా తరలివచ్చారు. బీసీల్లో 3బీ గా ఉన్న తమను తక్షణం 2ఏ కు మార్చి రిజర్వేషన్‌ వసతులను పెంచాలని నేతలు డిమాండ్‌ చేశారు. లేదంటే రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కూడల సంగమ పంచమసాలి పీఠాధిపతి శ్రీ బసవజయ మృత్యుంజయ స్వామీజీ మాట్లాడుతూ ఒకవేళ రాష్ట్రప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే తమ వర్గం స్వామీజీల నేతృత్వంలో నిరాహార దీక్ష చేపడతామని తెలిపారు. వ్యవసాయమే జీవనాధారమైన తమకు రిజర్వేషన్‌ ఇవ్వడం ప్రభుత్వ కర్తవ్యమని తెలిపారు. సమావేశంలో మంత్రులు మురుగేశ్‌ నిరాణి, సీసీపాటిల్, అన్ని పార్టీల నుంచి 20 మందికిపైగా ఎమ్మెల్యేలు, స్వామీజీలు పాల్గొన్నారు.  

ముఖ్యమంత్రి ఏమంటున్నారు ?
వరుస ఆందోళనల నేపథ్యంలో సీఎం యెడియూరప్ప అన్ని వర్గాలను బుజ్జగించేలా ప్రకటనలు చేస్తున్నారు. మంత్రిమండలిలో తగిన నిర్ణయం తీసుకుంటామని చెబుతూ వస్తున్నారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని మంత్రులకు స్పష్టంచేశారు.

మరిన్ని వార్తలు