నవ వధువుకు చేదు అనుభవం.. కన్యత్వ పరీక్షలో ఫెయిల్‌ కావడంతో..

4 Sep, 2022 21:22 IST|Sakshi

కొత్తగా పెళ్లై.. ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన నవ వధువుకు చేదు అనుభవం ఎదురైంది. కన్యత్వ పరీక్షలో వధువు విఫలం కావడంతో భర్త, అత్తామామలు దారుణానికి ఒడిగట్టారు. తన కన్యత్వాన్ని బజారుకీడ్చారు. పంచాయితీ నిర్వహించి ఆమెకు రూ.10 లక్షల జరిమానా విధించారు. ఈ షాకింగ్‌ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. భిల్వారా జిల్లాలో మే 11వ తేదీన బాధితురాలు(24)కు బాగోర్‌కు చెందిన ఒక వ్యక్తితో వివాహం జరిగింది. కాగా, వారి సంప్రదాయం ప్రకారం.. ‘కుక్డి’ విధానంలో నిర్వహించిన కన్యత్వ పరీక్షలో వధువు విఫలమైంది. దీంతో ఒక్కసారిగా అత్తింటివారు షాకయ్యారు. అనంతరం.. దీనిపై వధువును నిలదీయడంతో వరుడి గుండెలు బద్దలయ్యే విషయం చెప్పింది. 

పెళ్లికి ముందు.. తన ఇంటి వద్ద ఉండే ఓ వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్టు చెప్పుకొచ్చింది. దీంతో ఆగ్రహానికి లోనైన తన భర్త, అత్తామామలు.. ఆమెను చితకబాదారు. అనంతరం.. ఊరి పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించారు. దీంతో, పంచాయతీ పెద్దలు.. వధువు, ఆమె కుటుంబానికి రూ.10 లక్షల జరిమానా విధించారు. ఆ డబ్బులు చెల్లించనందుకు వధువుతోపాటు ఆమె కుటుంబాన్ని అత్తింటి వారు వేధించారు. నూతన వధువును ఆమె పుట్టింటికి పంపారు. దీంతో, వధువు కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వధువు భర్త, మామపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

ఇది కూడా చదవండి: కొడుకు ఎదుటే రన్నింగ్‌ రైలులో మహిళపై అత్యాచారయత్నం

మరిన్ని వార్తలు