నామినేషన్‌ పేపర్లు లాక్కుని, ఆపై వెంటపడి చీర కొంగు లాగి..

9 Jul, 2021 11:33 IST|Sakshi

ఉత్తర ప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు వేడి రాజేస్తున్నాయి. పార్టీల మధ్య, ప్రత్యర్థులతో కుమ్ములాటలు సోషల్‌ మీడియా సాక్షిగా బయటపడుతున్నాయి. తాజాగా దిగ్‌భ్రాంతి కలిగించే ఓ వీడియో నెట్‌లో వైరల్‌ అవుతోంది.  నామినేషన్‌ను అడ్డుకునేందుకు ఓ మహిళను చీరపట్టి లాగారు రాజకీయ ప్రత్యర్థులు.

లక్నో: సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్తను ప్రత్యర్థులు చీర కొంగు పట్టిలాగారు. పంచాయతీ ఎన్నికలకు ఓ అభ్యర్థి నామినేషన్‌ను ప్రతిపాదిస్తూ ఆమె నామినేషన్‌ సెంటర్‌లోకి వెళ్లాల్సి ఉంది. అయితే గడువు దగ్గర పడుతుండడంతో ప్రత్యర్థులు ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే  ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు వాళ్లు ఆమె చేతిలోని అభ్యర్థి ప్రతిపాదన పత్రాలను సైతం లాక్కున్నారు. అక్కడే ఉన్న కొందరు ఆమెకు మద్ధతుగా రావడంతో వాళ్లు ఆగిపోయారు.

తమ పార్టీ అభ్యర్థి ఎన్నిక ఎకగ్రీవం చేసేందుకే వాళ్లు ఆమెపై దాడికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.ఇక దాడికి పాల్పడింది బీజేపీ వాళ్లేనని సమాజ్‌వాదీ పార్టీ అంటోంది. లక్నోకు 130కిలోమీటర్ల దూరంలోని లఖింపూర్‌ ఖేరీలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ఘటనపై స్పందించాడు. అధికార దాహంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు చెందిన గుండాలు చెలరేగిపోతున్నారు అంటూ క్యాఫ్షన్‌ ఉంచాడు. 

యూపీలో 825 పంచాయితీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. గురవారం చాలాచోట్ల నామినేషన్ల పర్వంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మరోవైపు అందుకు సంబంధించిన వీడియోలను కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా కూడా ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు