పంచాయతీ ఎ‍న్నికలు.. పన్నీర్‌ పంచిన నాయకులు

20 Apr, 2021 17:58 IST|Sakshi

లక్నో: ఎన్నికలనగానే రాజకీయ నాయకులు మద్యం, డబ్బు పంపిణీ చేసి ప్రజలను తమ బుట్టలో వేసుకోవడానికి తెగ ప్రయత్నిం‍స్తుంటారు. అయితే, యూపీలోని అమ్రోహాలో నాయకులు కాస్త వేరైటిగా ఆలోచించారు. వీరు అక్కడ జరగబోయే పంచాయతీ ఎన్నికలలో పన్నీర్‌ను పంచి వార్తల్లో నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. చాకోరి గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థి సోదరుడు గజేం‍ద్ర సింగ్‌ తన సోదరుడికి మద్దతు తెలపాలని కోరుతూ కాటేజ్‌ జున్ను(పన్నీర్‌) పంచి పెట్టాడు.

విషయం తెలియగానే పోలీసులు ఆ ప్రదేశంపై దాడిచేసి, అక్కడున్న 30 కేజీల పన్నీర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ప్రజలను ప్రభావితం చేయటానికి ప్రయత్నించాడని గజేంద్ర సింగ్‌ పై కేసును కూడా నమోదు చేశారు. ఈ పన్నీర్‌ను అక్కడి ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు. అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కాగా, యూపీలో ఏప్రిల్‌ 15 నుంచి 29ల మధ్య నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న విషయం విదితమే . అయితే, ఈ విధంగా ఓటర్లను ప్రభావితం చేయడానికి గతంలో ఒక నాయకుడు 100 కేజీల రసగుల్లాలను పంచిపెట్టి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు