పళనిస్వామికే పట్టం

8 Oct, 2020 06:44 IST|Sakshi
పళనిస్వామికి పన్నీరు శుభాకాంక్షలు

అన్నాడీఎంకే కుర్చీ వివాదానికి తెర పడింది. సామరస్య పూర్వకంగా నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. సీఎం పళనిస్వామికి పట్టం కట్టారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి పళనిస్వామి అని బుధవారం ఆ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్‌ పన్నీరుసెల్వం స్వయంగా ప్రకటించారు. అలాగే, పార్టీకి 11 మందితో కూడిన మార్గదర్శక కమిటీ ఏర్పాటు చేశారు. ఇందు లో చిన్నమ్మ శశికళకు వ్యతిరేకంగా మొదటి నుంచి గళం విప్పుతున్న వాళ్లే ఉండడం గమనార్హం. 

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో సాగుతున్న రాజకీయ వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీఎం ఎవరో, మార్గదర్శక కమిటీలో ఎవరెవరు ఉండాలో అన్న అంశాలపై అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్‌ పన్నీరుసెల్వం, కో కన్వీనర్‌ పళనిస్వామి నివాసాల్లో బుధవారం వేకువజామున మూడు గంటల వరకు సీనియర్‌ మంత్రుల మంతనాలు వేర్వేరుగా సాగడంతో ఉత్కంఠ తప్పలేదు. ఎట్టకేలకు ఉత్కంఠకు తెరదించే రీతిలో రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయంలో ఉదయం 10 గంటలకు సమావేశం సాగింది. ఈ సమావేశం నిమిత్తం ముందుగా పన్నీరు సెల్వం అక్కడికి వచ్చారు. ఎంజీఆర్, జయలలిత విగ్రహాల వద్దకు చేరుకుని అంజలి ఘటించి లోనికి వెళ్లారు. ఆ తర్వాత పళనిస్వామి రావడంతో ఆయన మద్దతుదారుల హంగామా అంతా ఇంతా కాదు. పూల వర్షంలో ఆయన కాన్వాయ్‌ తడిసి ముద్దయింది. 

ముందుగా మార్గదర్శక కమిటీ.. 
పార్టీ ప్రిసీడియం చైర్మన్‌ మధుసూదన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పన్నీరు, పళని హాజరు కాగా, సంయుక్త కన్వీనర్లు, ఎంపీలు వైద్యలింగం, కేపీ మునుస్వామి నేతృత్వం వహించారు. ముందుగా పళనిస్వామి అన్నాడీఎంకే మార్గదర్శక కమిటీని ప్రకటించారు. ఇందులో మంత్రులు దిండుగల్‌ శ్రీనివాసన్, తంగమణి, ఎస్పీ వేలుమణి, జయకుమార్, సీవీ షణ్ముగం, ఆర్‌ కామరాజ్‌లకు చోటు కల్పించారు.  పార్టీ నిర్వాహక కార్యదర్శులు జేసీడీ ప్రభాకర్, మాజీ ఎంపీ పీహెచ్‌ మనోజ్‌పాండియన్, మాజీ మంత్రి మోహన్, మాజీ ఎంపీ గోపాలకృష్ణన్, చోళవందాన్‌ ఎమ్మెల్యే మాణిక్యంలకు అవకాశం కల్పించారు.  

సీఎం అభ్యర్థి పళని.. 
పన్నీరుసెల్వం ప్రసంగిస్తూ అన్నాడీఎంకే 2021 ఎన్నికలకు సిద్ధమైందని, పార్టీ నేతృత్వంలో కూట మి ఏర్పాటు అంటూ, సీఎం అభ్యర్థిగా పళనిస్వామి ని ఏకగ్రీవంగా ఎంపిక చేశామని ప్రకటించారు.

సంబరాల్లో సేన..
పళనిస్వామి సీఎం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ, ఏకగ్రీవ ఎంపిక ప్రకటనను పన్నీరు చేశారో లేదో, రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే వర్గాలు సంబరాల్లో మునిగాయి. అన్నాడీఎంకే కార్యాలయం పరిసరాల్లో బాణసంచా పేల్చుతూ, స్వీట్లు పంచారు. పళనిస్వామిని ప్రసన్నం చేసుకునేందుకు పార్టీ నేతలు పుష్పగుచ్ఛాలతో బారులు తీరారు. సమావేశాన్ని ముగించుకున్న నేతలందరూ మెరీనా తీరం వైపుగా కదిలారు. అక్కడి ఎంజీఆర్, జయలలిత సమాధుల వద్ద పుష్పాంజలి ఘటించారు. సీఎం ఎడపాడి పళనిస్వామి బుధవారం సాయంత్రం పన్నీరు సెల్వం  ఇంటికెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. 

చిన్నమ్మకు చెక్‌ పెట్టినట్టేనా..
జైలు నుంచి బయటకు వచ్చే శశికళ అన్నాడీఎంకేను కైవసం చేసుకోవడం ఖాయం అన్న ప్రచారానికి మార్గదర్శక కమిటీతో చెక్‌ పెట్టినట్టున్నారు. శశికళ వ్యతిరేకులకు ఈ కమిటీలో చోటు దక్కడం గమనార్హం. పార్టీలో, ప్రభుత్వంలో తటస్థంగా వ్యవహరించే మంత్రులు జయకుమార్, కామరాజ్‌ కమిటీలో ఉన్నారు. వీరూ చిన్నమ్మ వ్యతిరేకులే. మిగిలిన నలుగురు మంత్రులు సీఎం మద్దతుదారులు. పన్నీరు మద్దతుదారులుగా ఓ ఎమ్మెల్యే, నలుగురు మాజీలు ఈ కమిటీలో ఉన్నారు. వీరంతా మొదటి నుంచి చిన్నమ్మకు వ్యతిరేకంగా అన్నాడీఎంకేలో గళాన్ని స్వరాన్ని వినిపిస్తున్న వాళ్లే. ఇక, ఈ కమిటీలో పదవి కోసం మహిళా నేతలు ప్రయత్నించినా ఫలితం శూన్యం. అలాగే, మంత్రి ఓఎస్‌.మణియన్, సెల్లూరు రాజుతో పాటు మరో ఇద్దరు, అన్వర్‌రాజా వంటి సీనియర్ల ప్రయత్నాలు చేసినా, వీరు అప్పుడప్పుడు పరోక్షంగా చిన్నమ్మకు అనుకూలంగా నోరు జారిన వాళ్లే కావడం గమనార్హం. 

మరిన్ని వార్తలు