-

కర్ణాటక ఎన్నికల్లో పన్నీరు శిబిరం

8 Apr, 2023 08:20 IST|Sakshi

సాక్షి, చెన్నై: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పోటీచేస్తున్నట్టు ఆ పార్టీ సమన్వయ కమిటీ కనీ్వనర్‌ పన్నీరు సెల్వం శిబిరం ప్రకటించింది. కర్ణాటక బీజేపీ నేత యడ్యూరప్పతో ఆ శిబిరం ముఖ్యనేత పుహలేంది శుక్రవారం భేటీ అయ్యారు. మెజారిటీ శాతం నేతలు, సభ్యుల మద్దతుతో అన్నాడీఎంకేను పళనిస్వామి కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన పగ్గాలు కూడా చేపట్టారు.

అయితే, ఇవన్నీ తాత్కాలికమేనని కోర్టులో జరుగుతున్న న్యాయ పోరాటంలో గెలుపు తమదే ధీమాను ఆ పార్టీ సమన్వయ కమిటీ కనీ్వనర్‌ పన్నీరుసెల్వం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పళనిస్వామి కన్నా ముందుగా బీజేపీకి దగ్గరయ్యే విధంగా పన్నీరుసెల్వం ఓ అడుగు ముందుకు వెళ్లారు. కర్ణాటకలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీతో కలిసి పయనించేందుకు అన్నాడీఎంకే సిద్ధంగా ఉన్నట్టు పన్నీరు ప్రకటించారు. అలాగే, తన మద్దతు నేత పుహలేందిని కర్ణాటక బీజేపీ నేత యడ్యూరప్పతో భేటీకి పంపించారు. ఆయన్ను కలిసిన పుహలేంది పోటీ విషయంగా చర్చించి రావడం గమనార్హం. 

పోటీ తథ్యం.. 
మీడియాతో పన్నీరు సెల్వం మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికలలో తమ శిబిరం తరఫున అన్నాడీఎంకే అభ్యర్థులు పోటీలో ఉండడం తథ్యమని స్పష్టం చేశారు. తాము పోటీ చేస్తున్నామని ఇందులో మార్పులేదన్నారు. కోర్టు తుది  తీర్పు అన్నాడీఎంకేకు గట్టి సమాధానంగా ఉంటుందని ధీమా వ్యక్తంచేశారు. నిబంధనలకు విరుద్ధంగా, నోట్ల కట్టలతో ప్రధాన కార్యదర్శి పగ్గాల చేపట్టిన పళణిస్వామికి మున్ముందు ఆ శిబిరం నేతలు బుద్ధి చెప్పే రోజులు రాబోతున్నాయన్నారు. ప్రధాని మోదీని కలిసే అవకాశం కోరినట్టు, పిలుపువస్తే కలిసేందుకు సిద్ధమని పన్నీరుసెల్వం తెలిపారు.

మరిన్ని వార్తలు