అమ్మకు విదేశీ వైద్యం సలహా ఇచ్చింది నేనే.. కానీ

22 Mar, 2022 08:01 IST|Sakshi

అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు..

ఆర్ముగస్వామి కమిషన్‌ ముందు 

పన్నీరు సెల్వం వివరణ

సాక్షి, చెన్నై: అపోలో ఆస్పత్రిలో ఉన్న జయలలితను విదేశాలకు తీసుకెళ్లి వైద్యం అందించాలన్న సలహాను తొలుత ఇచ్చింది తానేనని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో– కన్వీనర్‌ పన్నీరు సెల్వం వ్యాఖ్యానించారు. దివంగత సీఎం జయలలిత మృతి కేసును దర్యాప్తు చేస్తున్న ఆర్ముగ స్వామి కమిషన్‌ ముందు సోమవారం ఆయన హాజరయ్యారు. 

విచారణ వేగవంతం 
జయలలిత మరణం మిస్టరీని నిగ్గుతేల్చేందుకు ఆర్ముగ స్వామి కమిషన్‌ మళ్లీ విచారణను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. నాలుగున్నరేళ్లుగా ఈ విచారణకు డుమ్మా కొడుతూ వచ్చిన పన్నీరు సెల్వం ఎట్టకేలకు సోమవారం జరిగిన విచారణకు వచ్చారు. కాగా మంగళవారం కూడా రావాలని కమిషన్‌ వర్గాలు ఆయన్ని ఆదేశించాయి. అలాగే, జయలలిత నెచ్చెలి శశికళతో పాటుగా సుదీర్ఘ కాలం పోయేస్‌ గార్డెన్‌లో ఉన్న ఆమె వదినమ్మ ఇలవరసి సైతం విచారణకు వచ్చారు. (చదవండి: రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకోండి.. నగదు రివార్డు పొందండి: స్టాలిన్‌ )

సీసీ కెమెరాల్ని తొలగించమని ఆదేశించ లేదు
పన్నీరు సెల్వం కమిషన్‌ ముందు ఉంచిన వాదనలు, వాంగ్ములం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు అపోలో ఆస్పత్రిలోని సీసీ కెమెరాలు తొలగించాలని తాను ఆదేశించ లేదని ఆయన స్పష్టం చేశారు. జయలలిత మధుమేహంతో బాధ పడుతున్న విషయం తనకు తెలుసునని, అయితే, ఆమెకు ఉన్న ఇతర ఆరోగ్య సమస్యల గురించి తనకు తెలియదని వెల్లడించారు. దివంగత నేతలు అన్నా, ఎంజీఆర్‌ను ఏవిధంగా విదేశాలకు తీసుకెళ్లి వైద్య చికిత్స అందించడం జరిగిందో, అదే తరహాలో అమ్మను కూడా విదేశాలకు తీసుకెళ్దామని అప్పటి ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్, మరో మంత్రి తంగమణితో పాటుగా పలువురి దృష్టికి తీసుకెళ్లానని, అయితే, ఎవరూ స్పందించ లేదని పేర్కొన్నారు.

అయితే, అపోలో వర్గాలు మాత్రం అమ్మ ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్టు పేర్కొంటూ వచ్చారని వివరించారు. అలాగే, విదేశాలకు తరలింపు విషయంలో తాను నిర్లక్ష్యం వహించినట్టుగా మాజీ సీఎస్‌ రామ్మోహన్‌ రావు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఇక, పలు ప్రశ్నలకు తెలియదు అని, తన దృష్టికి రాలేదని, తనతో ఎవరూ చర్చించలేదని, సలహా కూడా తీసుకోలేదని పన్నీరు సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. ఇక ఇలవరసి ఒకటి రెండు సార్లు తాను.. అపోలో ఆస్పత్రిలో అద్దాల నుంచి జయలలితను చూశానని వాంగ్ములం ఇచ్చినట్లు సమాచారం.

        

మరిన్ని వార్తలు