కుర్చీ కొట్లాట: పన్నీరు మంతనాలు 

30 Sep, 2020 06:31 IST|Sakshi

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో కుర్చీ కొట్లాట వేడెక్కింది. సర్వ సభ్య సమావేశంలో సాగిన వ్యవహారాల్ని పరిగణించిన పన్నీరుసెల్వం సచివాలయానికి దూ రంగా గ్రీన్‌వేస్‌ రోడ్డుకే పరిమితమయ్యారు. సీఎం పళనిస్వామి కరోనా సమీక్షను సైతం బహిష్కరించి, మద్దతుదారులతో మంతనాల్లో మునగడం చర్చకు దారి తీసింది.  అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం సోమవారం వాడివేడిగా సాగిన విషయం తెలిసిందే. ఆ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్‌ పన్నీరుసెల్వం, కో కన్వీనర్‌ పళనిస్వామి ఈ సమావేశం వేదికగా వాదులాటకు దిగినట్టు సంకేతాలు వెలువడ్డాయి.

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, సీఎం ఎవరో, 11 మందితో మార్గదర్శక కమిటీ వ్యవహారంలో ఈ ఇద్దరు నువ్వా, నేనా అన్నటు వాదులాడుకోవడమే కాదు, ఎవరు ఏ ద్రోహం చేశారో, తలబెట్టారో అంటూ తీవ్రంగానే విడుచుకు పడ్డారు. దీంతో అక్టోబర్‌ 7న అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి ఎవరో అన్న ప్రకటన అంటూ సభను ముగించేశారు. అలాగే, కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టారు. చదవండి: అన్నాడీఎంకేలో కుర్చీ వార్‌

దూరంగా.. మద్దతు మంతనాల్లో
సీఎం, కో కన్వీనర్‌ పళనిస్వామి వ్యాఖ్యల దాడి కాస్త స్వరాన్ని పెంచినట్టుగా సంకేతాలు వెలువడ్డ నేపథ్యంలో మంగళవారం సాగిన పరిణామాలు ఆసక్తికరంగా, చర్చకు దారి తీసే రీతిలో మారాయి. కరోనా వ్యవహారం, లాక్‌డౌన్‌ ఆంక్షలపై సీఎం పళనిస్వామి సచివాలయంలో కలెక్టర్లు, మంత్రులు, డాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయగా, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం డుమ్మా కొట్టారు. సచివాలయానికి దూరంగా ఉన్న ఆయన గ్రీన్‌వేస్‌ రోడ్డులోని నివాసంలో మద్దతుదారులతో మంతనాల్లో మునిగారు. పార్టీ సమన్వయ కమిటీ ప్రతినిధులు కేపీ మునుస్వామి, వైద్యలింగం సైతం గంటల తరబడి పన్నీరుతో భేటీ కావడం గమనార్హం. ఈ భేటీకి ప్రా«ధాన్యత పెరగడంతో పన్నీరు అడుగులు ఎలా ఉంటాయో అన్న చర్చ జోరందుకుంది. అదే సమయంలో పన్నీరు ఢిల్లీ వెళ్తారని కొందరు, సొంత జిల్లా తేనికి వెళ్లనున్నారంటూ మరి కొందరు చర్చించుకోవడంతో చర్చ రచ్చ వేడెక్కింది. అమ్మ మరణం తర్వాత పరిణామాలతో పార్టీ చీలిక సందర్భంలో సాగిన పరిణామాలను ద్రోహం అంటూ తనను ఉద్దేశించి పళనిస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని పన్నీరు జీర్ణించుకోలేకున్నట్టుందని ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు.

పన్నీరు చుట్టూ పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు చేరడం, కొందరు మంత్రులు ఆయనతో ఫోన్లో మాట్లాడడం వంటి పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే కుర్చీ కొట్లా ట వేడెక్కింది. ఈభేటీ ముగించుకుని బయటకు వచ్చిన వైద్యలింగం మీడియాతో మాట్లాడుతూ మనస్పర్థలు, విభేదాలు లేవని, అందరూ ఒక్కటేనని, పన్నీరు, పళని ఇద్దరికీ తన మద్దతు ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇక, మంత్రి జయకుమార్‌ను సచివాలయంలో మీడియా కదిలించగా, పార్టీలో చి న్నచిన్న వ్యవహారాలు ఉంటాయని, అయితే, తామంతా ఒక్కటే అని, ఐక్యతతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొంటామని, మళ్లీ అధికారం కైవ సం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం పళనిస్వామి నివాసంలో మంత్రి ఎస్పీ వేలుమణి సాయంత్రం భేటీ కావడం గమనార్హం. మంగ ళవారం సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఇళ్లకు అన్నాడీఎంకే నేతలు క్యూ కట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని వార్తలు